మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త ఎలక్ట్రిక్ కార్ Pixo.. ఒక్క ఛార్జ్‌తో 259 కి.మీ. ప్రయాణం, ఇంకా చాలా ప్రత్యేకతలు
నిస్సాన్ పిక్సో చిన్న EVగా యూరప్‌లో పరిచయమైంది. 27.5kWh బ్యాటరీ, 82hp మోటార్, 259 కి.మీ. రేంజ్, ADAS & ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Nissan Pixo Price, Range And Features Telugu: యూరప్ నగరాల్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ, నిస్సాన్ కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. నిస్సాన్ పిక్సో పేరుతో తీసుకొచ్చిన ఈ కారు ప్రధానంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించారు. రెనోతో కలిసి నిస్సాన్ ఈ కారును అభివృద్ధి చేసింది. స్లోవేనియాలోని నోవో మెస్టో ప్లాంట్‌లో పిక్సో తయారవుతుంది.
చిన్న పరిమాణం.. ప్రత్యేక డిజైన్
పిక్సోలో నిస్సాన్ తాజా ఎలక్ట్రిక్ కార్ల డిజైన్ స్టైల్‌ను ఉపయోగించింది. క్యూబ్ ఆకారాన్ని తలపించే బాడీ డిజైన్ దీని ప్రత్యేకత. పిక్సెల్ తరహా లైటింగ్, రోబోట్ ముఖాన్ని పోలిన ముందు బంపర్ ఆకట్టుకుంటాయి. చక్రాలపై కూడా పిక్సెల్ తరహా డిజైన్ హైలైట్స్ ఉన్నాయి.
పిక్సో పొడవు 3,796 మిల్లీమీటర్లు. వెడల్పు 1,790 మిల్లీమీటర్లు. ఇరుకైన నగర రహదారులకు అనువుగా ఈ కొలతలతో రూపొందించినట్లు నిస్సాన్ చెబుతోంది. దీని టర్నింగ్ సర్కిల్ 9.9 మీటర్లు. వండర్ పర్పుల్ & గేర్ బ్లూ రంగులు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ కలర్ ఎలిమెంట్లు కాంట్రాస్ట్ లుక్ ఇస్తాయి.
నలుగురికి సౌకర్యంగా క్యాబిన్
పిక్సోలో సరళమైన ఆధునిక ఇంటీరియర్ కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ నిలువు ఆకృతిలో ఉంటుంది. ఏసీ వెంట్ల చుట్టూ ఆరెంజ్ రంగు హైలైట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం ఫిజికల్ బటన్లు & డయల్స్ ఇచ్చారు.
స్టీరింగ్ వెనుక పెద్ద డ్రైవ్ సెలెక్టర్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌లో 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి తోడు 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంది.
ఇది కూడా చదవండి: కనీస డౌన్‌పేమెంట్‌తోనే కొత్త టాటా టిగోర్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.. పూర్తి ఫైనాన్స్ ప్లాన్ ఇదిగో
టెక్నాలజీకి పెద్దపీట
పిక్సోలో గూగుల్ జెమినీ అందుబాటులో ఉంటుంది. ఇది ఈ విభాగంలో తొలిసారిగా అందిస్తున్న ఫీచర్ అని నిస్సాన్ చెబుతోంది. 16 భాషలు & మాండలికాల్లో దీన్ని అందించనున్నారు. గూగుల్ బిల్ట్ ఇన్, మై నిస్సాన్ యాప్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఫేస్ ఐడీ ద్వారా వేర్వేరు డ్రైవర్లను గుర్తించే సదుపాయం ఉంటుంది. ప్రతి డ్రైవర్‌కు సంబంధించిన వ్యక్తిగత సెట్టింగులను కూడా గుర్తుంచుకుంటుంది.
భద్రత విషయంలోనూ పిక్సోలో అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ & హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
వెనుక సీట్లను ముందుకు లేదా వెనక్కి జరుపుకోవచ్చు. అవసరాన్ని బట్టి ప్రయాణికుల కోసం ఎక్కువ స్థలం లేదా సామాను కోసం ఎక్కువ స్థలం కల్పించుకోవచ్చు. బూట్ సామర్థ్యం 356 లీటర్లు. ఇందులో 50 లీటర్ల స్థలాన్ని ఛార్జింగ్ కేబుల్ ఆక్రమిస్తుంది.
259 కిలోమీటర్ల రేంజ్
నిస్సాన్ పిక్సోలో 27.5kWh LFP బ్యాటరీ ఉంటుంది. దీనికి 82hp శక్తిని అందించే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. టార్క్ & పూర్తి పనితీరు వివరాలను నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే WLTP ప్రకారం 259 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపింది.
ఛార్జింగ్ విషయంలోనూ పిక్సోకు మంచి సామర్థ్యం ఉంది. 50kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 15 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సుమారు 28 నిమిషాలు పడుతుంది. 11kW బైడైరెక్షనల్ AC ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ఇది కూడా చదవండి: Mahindra Thar OGలో భారీ అప్‌గ్రేడ్స్.. కొత్త ప్లాట్‌ఫామ్ నుంచి పవర్‌ఫుల్ ఇంజిన్ వరకు!
ధర
నిస్సాన్ పిక్సో ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. యూరప్‌లో కస్టమర్ డెలివరీలు 2027 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందా, లేదా అన్న విషయాన్ని కూడా కంపెనీ వెల్లడించలేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















