Nissan Magnite Turbo CVT - రియల్ వరల్డ్ మైలేజ్ ఎంతంటే?
నిస్సాన్ మ్యాగ్నైట్ టర్బో CVT నిజ ప్రపంచంలో ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?, ఎక్స్‌పర్ట్స్ చేసిన రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.

Nissan Magnite Turbo CVT Real World Mileage: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మంచి పేరు సంపాదించుకున్న మోడల్ - నిస్సాన్ మ్యాగ్నైట్. ప్రత్యేకంగా టర్బో CVT వెర్షన్‌లోని స్మూత్ డ్రైవ్, సిటీ ఫ్రెండ్లీ నేచర్ కారణంగా ఈ కారు చాలామంది యూజర్లకు నచ్చింది. అయితే, కొనుగోలుదారులు కచ్చితంగా తెలుసుకోవలసిన విషయం - ఈ కారు నిజ జీవితంలో ఎంత మైలేజ్ ఇస్తుంది?. ఫ్యాక్టరీ చెప్పిన సంఖ్యలు ఒకవైపు, మనం ప్రతి రోజు ఉపయోగించే సందర్భాల్లో వచ్చే మైలేజ్ మరోవైపు పెట్టుకుని చూసి, తేడాను అర్ధం చేసుకోవాలి. అందుకే, ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్ నిస్సాన్ మ్యాగ్నైట్ టర్బో CVT ని రియల్ వరల్డ్ పరిస్థితుల్లో పరీక్షించి, ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు.
నిస్సాన్ మ్యాగ్నైట్ ఫీచర్లు, వెహికల్ సెటప్
ఎక్స్‌పర్ట్స్ పరీక్షించిన నిస్సాన్ మ్యాగ్నైట్ వెర్షన్‌లో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 100hp పవర్ ఇవ్వగలదు. CVT గేర్‌బాక్స్ కారణంగా డ్రైవ్ ఎప్పుడూ స్మూత్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ వెర్షన్‌కు 17.9kpl ARAI సర్టిఫైడ్ మైలేజ్ ఉంది. కానీ నిజమైన పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసుకోవడమే ముఖ్యం.
నగర మైలేజ్ - ఈ కారు ట్రాఫిక్‌లో ఎంత ఇచ్చింది?
హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉండే ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసిన టెస్ట్‌లో, నిస్సాన్ మ్యాగ్నైట్ CVT లీటరుకు 9.5 km మైలేజ్ ఇచ్చింది. నగరాల్లో ఎక్కువగా స్టాప్–గో ట్రాఫిక్, ఏసీ నిరంతరం ఆన్‌లో ఉండడం, చిన్న దూరాలు డ్రైవ్ చేయడం వంటి పరిస్థితుల్లో ఈ సంఖ్య సహజమే. CVT గేర్‌బాక్స్ డ్రైవ్‌ను స్మూత్‌గా ఉంచడంలో బాగా పని చేస్తుంది, అదే సమయంలో కొంచెం ఎక్కువ ఇంధనం వినియోగించడం కూడా సహజమే.
హైవే మైలేజ్ - ఓపెన్ రోడ్‌లో ఎలా ఉంది?
హైవేపై మీద గంటకు 80-90km స్థిరమైన స్పీడ్‌తో డ్రైవ్ చేసినప్పుడు, మ్యాగ్నైట్ 15.22 kmpl మైలేజ్ ఇచ్చింది. ఇది CVT గేర్‌బాక్స్ ఉన్న SUV విషయంలో చాలా మంచి సంఖ్యగా చెప్పాలి. ఓపెన్ రోడ్‌లో ఇంజిన్ RPMని స్థిరంగా ఉంచే CVT ట్యూనింగ్ చాలావరకు ప్రయోజనం అందించింది.
మొత్తం సగటు మైలేజ్
సిటీ + హైవే రెండు మైలేజ్‌లను కలిపి చూస్తే, మ్యాగ్నైట్ టర్బో CVT సగటున 12.36 kmpl మైలేజ్ ఇచ్చింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఉన్న CVT వెహికల్స్ విషయంలో దీనిని డీసెంట్ యావరేజ్‌గా చెప్పొచ్చు.
ఈ సంఖ్యలు ఎందుకు వచ్చాయి?
- వెహికల్ కర్బ్ వెయిట్ 1,103 కేజీలు - తక్కువ బరువు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.
- ఆటో స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ లేకపోవడం నగర మైలేజ్ కొద్దిగా తగ్గడానికిగల కారణం.
- బయటి ఉష్ణోగ్రతలు 35–40°C ఉండడం వల్ల AC లోడ్ పెరగడం సహజం.
తెలుగు రాష్ట్రాల్లో కొనాలని చూస్తున్నవారికి ఓ మాట
హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో రోజూ డ్రైవ్ చేసే యూజర్లకు మ్యాగ్నైట్ టర్బో CVT మంచి కంఫర్ట్, స్మూత్‌నెస్ ఇస్తుంది. CVT వల్ల మైలేజ్ కొంచెం తగ్గినా, ఉపయోగించుకోగల సౌకర్యం దాని ప్లస్ పాయింట్. అలాగే హైవే ట్రావెల్స్ ఎక్కువగా చేసే వారికి లీటరుకు 15km వరకు రావడం మంచి విషయం.
కాబట్టి, రియల్ వరల్డ్‌లో మ్యాగ్నైట్ టర్బో CVT ఇచ్చే మైలేజ్ డీసెంట్ రేంజ్‌లోనే ఉంది. కంఫర్ట్, స్మూత్ డ్రైవ్, SUV ఫీలింగ్ కావాలనుకునే వారికి ఈ కారు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















