EV Charging: స్మార్ట్ ఫోన్ కంటే వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జ్ చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?
ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ చేయాలంటే.. గంటకు పైనే సమయం పడుతుంది. ఆయా వాహనాల సామర్థ్యాన్ని బట్టి ఈ టైం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు అమెరికన్ శాస్త్రవేత్తలు త్వరలో చెక్ చెప్పబోతున్నారు.
చాలా మంది ఎలక్ట్రిక్ వాహనదారులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఛార్జింగ్. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఛార్జింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అత్యవసరంగా వెళ్లాల్సి ఉన్న వారికి చాలా ఇబ్బందిగా, అంతకు మించి చిరాకుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు అమెరికన్ ప్రభుత్వ పరిశోధకులు. కేవలం 10 నిమిషాల్లో 90 శాతం ఎలక్ట్రిక్ కారు బ్యాటరీలను ఛార్జ్ చేసే మార్గాన్ని కనుగొన్నారు. ఇదే వాస్తవరూపం దాల్చితే స్మార్ట్ ఫోన్ కన్నా వేగంగా కార్ ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
5 ఏళ్లలో అందుబాటులోకి కొత్త టెక్నాలజీ!
ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ కొత్త టెక్నాలజీని మరో 5 సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీని మూలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని వెల్లడించారు. అంతేకాదు.. ఇదే కనుక అమల్లోకి వస్తే కాలుష్య కారక వాహనాలకు చెక్ పెట్టి.. క్లీన్ వెహికల్స్ వాడేందుకు ప్రజలు మొగ్గు చూపుతారని వెల్లడించారు.
గ్యాస్ నింపించుకునే సమయంలో ఛార్జింగ్
ప్రస్తుతం ఫాస్టెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం పరిశోధనలు చేస్తున్న బృందానికి చీఫ్ గా కొనసాగుతున్న ఇడాహో నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్త ఎరిక్ డ్యూఫెక్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గ్యాస్ స్టేషన్ దగ్గర వాహనాలకు గ్యాస్ నింపించుకునేందుకు ఎంత సమయం పడుతుందో.. ఛార్జింగ్ స్టేషన్ల వద్ద కూడా అంతే సమయం పట్టే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
వేగవంతమైన టెస్లా ఛార్జింగ్
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రస్తుత ఛార్జింగ్ మెకానిజమ్ వేర్వేరు ఛార్జింగ్ సమయాలను కలిగి ఉన్న వివిధ రకాల ఛార్జర్‌లను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, నెమ్మదిగా ఉండేవి EV బ్యాటరీని 40-50 గంటల్లో ఛార్జ్ చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేగవంతమైన ఛార్జర్‌లు EV బ్యాటరీని 20 నిమిషాల నుంచి గంటలో 80% వరకు తీసుకురాగలవు. ప్రపంచంలోని అతిపెద్ద EV తయారీదారులలో ఒకరైన టెస్లా, దాని సూపర్ చార్జర్ నెట్ వర్క్ 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేస్తుందని, ఆ ఛార్జింగ్‌తో గంటకు 320 కిలో మీటర్లకు పైగా దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
ఫాస్టెస్ట్ ఛార్జింగ్ తో సమస్యలు!
వేగవంతమైన ఛార్జింగ్ మూలంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బ్యాటరీలను వేగంగా ఛార్జింగ్ చేయడం మూలంగా వాటి లైఫ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉంటుందే వాదన సైతం ఉంది. ఈ నేపథ్యంలో డ్యూఫెక్ బృందం వేగంగా ఛార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీల పనితీరును పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలంగా ఎదురవుతున్న సమస్యలు.. వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద పరిశోధనలు జరుపుతున్నారు. అయితే పెట్రోల్ ట్యాంక్ ను రీఫిల్ చేసేంత వేగంగా ఈవీలకు ఛార్జింగ్ ఎక్కించడానికి ఈ పరిశోధన బృందం చాలా వేగంగా పరిశోధన జరపాల్సి ఉంటుందని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. త్వరలోనే ఈ టీమ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.