కొత్త ఫీచర్లతో స్కోడా కైలాక్ క్లాసిక్+, ప్రెస్టీజ్+ వేరియంట్లు లాంచ్ - త్వరలో స్పోర్ట్‌లైన్ వేరియంట్
స్కోడా కైలాక్‌కు Classic+, Prestige+ అనే కొత్త వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ఫీచర్లు, ఆటోమేటిక్ ఆప్షన్లు, త్వరలో స్పోర్ట్‌లైన్ వేరియంట్‌తో కైలాక్ లైనప్ మరింత బలపడింది.

Skoda Kylaq New Variants 2026: స్కోడా ఇండియా, తన కాంపాక్ట్ SUV అయిన కైలాక్ లైనప్‌ను మరింత విస్తరించింది. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ సందర్భంగా, కైలాక్‌కు కొత్త క్లాసిక్+ & ప్రెస్టీజ్+ వేరియంట్ల (Skoda Kylaq Classic+ & Skoda Kylaq Prestige+ variants) ధరలను అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న సిగ్నేచర్, సిగ్నేచర్+ వేరియంట్లకు (Kylaq Signature & Kylaq Signature+ variants) కొత్త ఫీచర్లు కూడా జోడించినట్టు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కైలాక్ స్పోర్ట్‌లైన్ (Kylaq Sportline variant) అనే కొత్త స్పోర్టీ వేరియంట్ కూడా మార్కెట్‌లోకి రానుంది.
ఇప్పటివరకు 4 వేరియంట్లతో ఉన్న స్కోడా కైలాక్, కొత్త వాటితో కలిపి, ఇప్పుడు మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీంతో, తెలుగు రాష్ట్రాల ప్రజలకు బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు విస్తృతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
| 2026 స్కోడా కైలాక్ వేరియంట్లు | MT (రూ. లక్షల్లో) | AT (రూ. లక్షల్లో) |
| Classic | 7.59 | - |
| Classic+ (NEW) | 8.25 | 9.25 |
| Signature | 9.43 | 10.43 |
| Signature+ | 10.77 | 11.77 |
| Prestige | 11.75 | 12.75 |
| Prestige+ (NEW) | 11.99 | 12.99 |
కైలాక్ క్లాసిక్+ వేరియంట్ ముఖ్య ఫీచర్లు
కొత్త క్లాసిక్+ వేరియంట్ బేస్ క్లాసిక్ మోడల్ కంటే మెరుగైన ఫీచర్లతో వచ్చింది. ఇందులో 16 ఇంచుల అలాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో డిమ్మింగ్ IRVM, ఆటోమేటిక్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.
ఇది మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి 115 hp శక్తి అందుతుంది. క్లాసిక్ మాన్యువల్ వేరియంట్ ధరపై రూ.66,000 అదనంగా క్లాసిక్+ ధరలు ప్రారంభమవుతాయి. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.9.25 లక్షల నుంచి మొదలవుతుంది (ఎక్స్-షోరూమ్ ధర). దీంతో కైలాక్ ఆటోమేటిక్ ఇప్పుడు గతంతో పోలిస్తే మరింత అందుబాటులోకి వచ్చింది.
సిగ్నేచర్, సిగ్నేచర్+ వేరియంట్లకు కొత్త ఫీచర్లు
మిడ్ స్పెక్ అయిన సిగ్నేచర్, సిగ్నేచర్+ వేరియంట్లకు ఇప్పుడు టాప్ వేరియంట్ నుంచి కొన్ని ఫీచర్లు వచ్చాయి. వీటిలో సన్‌రూఫ్, రియర్ వైపర్, ఆటో వైపర్లు, ఆటోమేటిక్ వేరియంట్లకు ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.
ధరల విషయానికి వస్తే, సిగ్నేచర్ వేరియంట్లు ఇప్పుడు రూ.9.43 లక్షల నుంచి రూ.10.43 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వరకు ఉన్నాయి. సిగ్నేచర్+ వేరియంట్ల ధరలు రూ.10.77 లక్షల నుంచి రూ.11.77 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వరకు పెరిగాయి.
స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్+ వేరియంట్లు
త్వరలో వచ్చే కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ మరింత స్పోర్టీ లుక్‌తో ఉండనుంది. లోపల, బయట కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. అయితే ఇంజిన్, మెకానికల్ అంశాల్లో మార్పులు ఉండవు.
ఇక కొత్త ప్రెస్టీజ్+ వేరియంట్ ఇప్పుడు కైలాక్ లైనప్‌లో టాప్ మోడల్‌గా నిలుస్తోంది. పాత ప్రెస్టీజ్ వేరియంట్ నుంచి 6 దిశల్లో సర్దుబాటు అయ్యే పవర్డ్ ఫ్రంట్ సీట్లను తొలగించడంతో, దాని ధర రూ.24,000 తగ్గింది. అయినప్పటికీ, కైలాక్ గరిష్ట ధర రూ.12.99 లక్షల వద్దనే కొనసాగుతోంది.
మొత్తంగా చూస్తే, స్కోడా కైలాక్ ఇప్పుడు ఫీచర్లు, వేరియంట్ల పరంగా మరింత బలమైన కాంపాక్ట్ SUVగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విభాగంలో కైలాక్‌కు ఇది పెద్ద ప్లస్‌గా మారనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















