Maruti Baleno Vs Hyundai i20: తక్కువ ధరలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు కావాలనుకునేవారికి ఏది బెస్ట్?
మారుతి బలెనో, హ్యుండాయ్ ఐ20ల్లో ఏది బెస్ట్ కారు?
ఒకప్పుడు కార్లు కొనుగోలు చేసేవారు పవర్ స్టీరింగ్, ఏసీల గురించి మాట్లాడుకునేవారు. అయితే కాలంతో పాటు కార్లు కూడా మారాయి. ఎస్‌యూవీల నుంచి హ్యాచ్‌బ్యాక్‌ల వరకు కార్లలో అందించే టెక్నాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం చవకైన హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. లుక్, ఫీచర్లు, స్టైల్‌ను ఇప్పుడు కొత్త కారు కొనాలనుకునేవారు కోరుకుంటున్నారు.
ఇప్పుడు మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న హ్యాచ్‌బ్యాక్‌ల్లో హ్యుండాయ్ ఐ20, మారుతి బలెనో ఉన్నాయి. ఇవి రెండూ ఎక్కువ ఫీచర్లున్న హ్యాచ్‌బ్యాక్‌లు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నాయి. మారుతి బలెనో కొత్త వేరియంట్ కూడా ఇటీవలే లాంచ్ అయింది. ఐ20లో కూడా ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్టో చూద్దాం...
దేని లుక్స్ బాగున్నాయి?
లుక్స్ విషయంలో రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టమే. ఎందుకంటే రెండూ ప్రీమియం లుక్‌తో, పెద్ద సైజుతోనే లాంచ్ అయ్యాయి. వీటిలో ఐ20 పెద్ద ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. దీని పొడవు 3,995 మిల్లీమీటర్లు కాగా... బలెనో పొడవు 3,990 మిల్లీమీటర్లుగా ఉంది. ఐ20 కొంచెం వెడల్పుగా ఉండనుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే... ఐ20 లుక్ మరింత ప్రీమియంగా ఉండనుంది. కొత్త బలెనో కొంచెం రీడిజైన్డ్ మోడల్ తరహాలో ఉంది.
ఇంటీరియర్స్ దేనివి బాగున్నాయి?
కొత్త ఐ20లో బ్లాక్ థీమ్‌ను అందించారు. స్పోర్ట్స్ లుక్‌తో ఇది లాంచ్ అయింది. క్రెటా తరహా స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్‌లు దీనికి ప్రీమియం లుక్ తీసుకురానుంది. డిజైన్, క్వాలిటీల విషయంలో మారుతి తన బలెనోను మరో స్థాయికి తీసుకువెళ్లించింది. బ్లూ, బ్లాక్, సిల్వర్ కలర్ మిక్సింగ్‌తో వచ్చిన ఈ ఇంటీరియర్ క్యాబిన్ లుక్‌ను ఎంతో మెరుగు పరిచింది. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్, కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను కూడా అందిస్తున్నారు. ఈ రెండిటి బూట్ స్పేస్ కూడా బాగానే ఉంది.
ఫీచర్ల సంగతేంటి?
మారుతి సుజుకి టాప్ ఎండ్ బలెనోలో కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను అందించారు.ఐ20లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండగా... బలెనోలో కూడా అదే సైజు టచ్ స్క్రీన్ అందించారు. కానీ టచ్ రెస్పాన్స్ ఐ20లో బాగుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, క్లైమెట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు రెండిట్లోనూ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. కొత్త బలెనోలో 360 డిగ్రీ కెమెరా అందించారు. ఐ20లో సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐ20లో రేర్ వ్యూ కెమెరానే ఉన్నప్పటికీ దీని డిస్‌ప్లే, సౌండింగ్ ఆడియో సిస్టం బాగున్నాయి.
ఓవరాల్‌గా ఏది బాగుంది?
ఐ20 ప్రారంభ ధర రూ.6.9 లక్షలు కాగా... హైఎండ్ వేరియంట్ ధర రూ.11.5 లక్షలుగా ఉంది. ఇక బలెనో ప్రారంభ ధర రూ.6.3 లక్షలు కాగా... హైఎండ్ వేరియంట్ ధర రూ.9.4 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం ఈ ధరలో బెస్ట్, ఎక్కువ ఫీచర్లున్న కార్లు ఈ రెండే. మైలేజ్ ఎక్కువ కావాలనుకునేవారికి, నగరాల్లో రోజువారీ వినియోగానికి కారు కావాలనుకునేవారికి బలెనో మంచి చాయిస్. ఇందులో మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐ20లో మరింత సమర్థవంతమైన ఇంజిన్ ఉంది. దీని ధర బలెనో పోలిస్తే కాస్త ఎక్కువే అయినా... ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అనే ట్యాగ్‌కు ఇది సరైన న్యాయం చేస్తుంది.