FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
FIVA world vehicle heritage award: మారుతి 800కు FIVA వరల్డ్ వెహికల్ హెరిటేజ్ అవార్డు లభించింది. ఈ గౌరవం అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా మారుతి 800 నిలిచింది.

Maruti 800 Global Award: ఒకప్పుడు, సామాన్యుడి కారు అంటే ముందుగా గుర్తొచ్చేది మారుతి 800. భారతీయ వాహన రంగం చరిత్రనే మార్చేసిన ఈ చిన్న కారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు పొందింది. మారుతి 800కు 'ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ వెహిక్యూల్స్ ఏన్సియన్స్' (FIVA) వరల్డ్ వెహికల్ హెరిటేజ్ అవార్డు లభించింది. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా మారుతి 800 నిలిచింది. చారిత్రక వాహనాల కోసం పనిచేసే అంతర్జాతీయ సమాఖ్య FIVA ఈ అవార్డును ప్రవేశపెట్టింది. ప్రజల రవాణా అవసరాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపిన కార్లను ఈ అవార్డు ద్వారా గుర్తిస్తారు.
సామాన్యుడి జీవితాన్ని మార్చిన కారు
మారుతి సుజుకి అభిప్రాయం ప్రకారం.. మారుతి 800 కేవలం ఓ కారు మాత్రమే కాదు. వ్యక్తిగత రవాణాను సామాన్యులకు చేరువ చేసిన వాహనం. దేశంలో రోజువారీ ప్రయాణాల తీరును మార్చడంలో ఈ కారు ప్రభావం చూపించింది. అందుకే ఈ అవార్డు మారుతి 800కు దక్కడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకప్పుడు సొంత కారు కొనడం అనేది చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెద్ద కలగా ఉండేది. అలాంటి సమయంలో మారుతి 800 వచ్చింది, "ఇంటి ముందు ఓ కారు" కలను నిజం చేసుకునే అవకాశాన్ని ఎంతోమందికి కల్పించింది. అందుకే భారతీయ కార్ల చరిత్రలో ఈ మోడల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇది కూడా చదవండి: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ప్రపంచంలోని 21 చారిత్రక వాహనాలతో పోటీ
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన 21 వాహనాలను ఎంపిక చేశారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా సహా పలు దేశాలకు చెందిన వాహనాలు ఈ జాబితాలో ఉన్నాయి. వాటిలో మారుతి 800కు ఈ గౌరవం దక్కింది.
భారతదేశం నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి, ఏకైక కారుగా నిలవడం మారుతి 800 ప్రత్యేకతను మరింత పెంచింది. దేశంలో వ్యక్తిగత రవాణా రంగంపై ఈ కారు చూపిన ప్రభావానికి అంతర్జాతీయ గుర్తింపుగా ఈ అవార్డును చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ప్రత్యేక స్థానం
మారుతి 800 పేరు వినగానే ఎన్నో కుటుంబాలకు తొలి కారు, మొదటి ప్రయాణం, పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తరతరాలుగా భారతీయ రోడ్లపై కనిపించిన ఈ కారు ఇప్పుడు ప్రపంచ వాహన వారసత్వ చరిత్రలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















