Vehicle Insurance: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
Toll Gate Insurance Alert: టోల్ ప్లాజా దాటిన వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే SMS అలర్ట్ పంపించే పైలట్ ప్రాజెక్ట్‌ను NHAI ప్రారంభించింది. బీమా లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా విధించవచ్చు.

Vehicle Third Party Insurance: వాహనానికి ఇన్సూరెన్స్ చేయించకుండా లేదా రెన్యువల్ చేయకుండా డ్రైవింగ్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరు కనిపెడతారులే అన్న ధీమాతో ఉన్నారా? ఇకపై అలాంటి పప్పులు ఉడకవు. బీమా లేని/రెన్యువల్ చేయని వాహనాలను గుర్తించడం మరింత సులభం కానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ హైవేపై టోల్ ప్లాజా దాటిన వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ (Third Party Insurance) లేకపోతే.. ఆ వాహన యజమానికి నిమిషాల్లోనే SMS అలర్ట్ పంపించే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని దిల్లీలోని ముండ్కా టోల్ ప్లాజా వద్ద చేపట్టారు. అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II)పై ఈ టోల్ ప్లాజా ఉంది. ప్రయోగం విజయవంతమైతే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ విధానం ద్వారా.. వాహనదారులు తమ బీమాను సకాలంలో రెన్యువల్ చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు, ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించడం సులభం కానుంది. బీమా లేని వాహనాలతో ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం కూడా ఈ చర్య లక్ష్యాల్లో ఒకటి.
టోల్ ప్లాజా వద్ద ఇన్సూరెన్స్ లేని వాహనాలను ఎలా గుర్తిస్తారు?
టోల్ ప్లాజా దాటే వాహనాల వివరాలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నిర్వహించే వాహన్ (Vahan) డేటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అనేది తనిఖీ చేస్తారు. ఒకవేళ వాహన బీమా గడువు ముగిసినా లేదా అసలు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకపోయినా.. ఆ వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు SMS పంపిస్తారు. టోల్ ప్లాజా దాటిన కొన్ని నిమిషాల్లోనే ఈ సందేశం అందుతుంది.
వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, టోల్ ప్లాజా దాటిన సమయం, గడువు ముగిసిన బీమా వివరాలు ఆ SMSలో ఉంటాయి. ఇన్సూరెన్స్ గడువు ఎప్పుడు ముగిసిందో కూడా తెలియజేస్తారు. జరిమానా నుంచి తప్పించుకోవాలంటే వెంటనే పాలసీని రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తారు.
ఇది కూడా చదవండి: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంత జరిమానా?
మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం, పబ్లిక్ రోడ్లపై తిరిగే వాహనాలకు చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ బీమా లేకుండా వాహనం నడిపితే జరిమానా విధించే అవకాశం ఉంది.
- మొదటిసారి నిబంధన ఉల్లంఘిస్తే: వాహనం బేస్ ప్రీమియంకు మూడు రెట్లు లేదా రూ.5,000.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత జరిమానా విధిస్తారు.
- మళ్లీ అదే తప్పు చేస్తే: బేస్ ప్రీమియంకు ఐదు రెట్లు లేదా రూ.10,000.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత జరిమానా విధిస్తారు.
అంటే రెండోసారి లేదా ఆ తర్వాత కూడా ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా రూ.10,000 వరకు ఉండవచ్చు.
వాహనదారులు ఏం చేయాలి?
మీ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పాలసీ గడువు ముగియబోతుంటే ముందుగానే రెన్యువల్ చేయించండి. ముఖ్యంగా వాహన్ డేటాబేస్‌లో నమోదైన మొబైల్ నంబర్ సరైనదో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కొత్త వ్యవస్థ ద్వారా పంపించే SMS అలర్ట్‌లు.. రిజిస్టర్ అయిన వాహన యజమాని నంబర్‌కే చేరతాయి.
ఇది కూడా చదవండి: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమే. దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని గుర్తించడం మరింత సులభం కానుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















