Kia Carens Clavis EVకి లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ.. ఫెస్టివ్ సీజన్‌లో కియా కంపెనీ కొత్త ఆఫర్
కారెన్స్ క్లావిస్ ఈవీ మొదటి యజమానులకు 15 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని కియా కంపెనీ ప్రకటించింది. పాత యజమానులకు అప్‌గ్రేడ్ అవకాశం కూడా ఉంది.

Kia Carens Clavis EV Price, Range And Features Telugu: ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవాళ్ల కోసం, బ్యాటరీ వారంటీ విషయంలో కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కారెన్స్ క్లావిస్ ఈవీ హై వోల్టేజ్ బ్యాటరీపై ఏకంగా 15 ఏళ్ల వారంటీని (Kia Carens Clavis EV Battery Warranty) ప్రకటించింది. ఈ వారంటీకి కిలోమీటర్ల పరిమితి ఉండదు. అంటే, ఈ కారును కొన్న మొదటి ప్రైవేట్ యజమానులకు 15 ఏళ్ల పాటు ఎన్ని కిలోమీటర్లు వాహనం నడిపినా బ్యాటరీ కవరేజ్ కొనసాగుతుంది.
2026 ఆగస్టు 1 నుంచి విక్రయించిన కారెన్స్ క్లావిస్ ఈవీ వాహనాలకు ఈ కొత్త వారంటీ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ జీవితకాలంపై ఉండే సందేహాలను తగ్గించడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా కనిపిస్తోంది.
మినహాయింపులు వర్తిస్తాయ్..
అయితే, 15 ఏళ్ల వారంటీ ప్రయోజనం అందరికీ వర్తించదు. వాణిజ్య వాహనాల నిర్వాహకులు, ఫ్లీట్ ఆపరేటర్లు & రెండో యజమానులకు మాత్రం పాత వారంటీ నిబంధనలే కొనసాగుతాయి. వీరికి హై వోల్టేజ్ బ్యాటరీపై 8 ఏళ్ల వరకు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. ఇందులో ఏది ముందుగా పూర్తైతే అదే వర్తిస్తుంది.
ఇప్పటికే కారెన్స్ క్లావిస్ ఈవీ కొనుగోలు చేసిన ప్రైవేట్ యజమానులకు కూడా కియా ఒక అవకాశం కల్పించింది. 2026 ఆగస్టు 1కి ముందు వాహనం కొనుగోలు చేసినవాళ్లు తమ ప్రస్తుత బ్యాటరీ వారంటీని 15 ఏళ్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీనికి వన్‌టైమ్ పేమెంట్ కింద రూ.3,400 రుసుము చెల్లించాలి.
నిబంధనల ప్రకారం వారంటీ
ఈ అప్‌గ్రేడ్‌కు కొన్ని నిబంధనలు ఉంటాయి. కంపెనీ ఎక్స్‌పర్ట్‌లు ఆ వాహనాన్ని ముందుగా పరిశీలిస్తారు. కియా నిర్దేశించిన అర్హతలు & ఇతర నిబంధనలకు వాహనం అనుగుణంగా ఉండాలి. అలా ఉంటేనే కొత్త వారంటీ ప్రయోజనం అందుబాటులోకి వస్తుంది.
ఇది కూడా చదవండి: చూపులకు SUV రఫ్‌నెస్.. క్యాబిన్‌లో టెక్నాలజీ హంగామా.. హ్యుందాయ్ బేయాన్‌లో ఇవే హైలైట్స్!
కియా ఇండియా ఇప్పటికే కారెన్స్ క్లావిస్ ఈవీ కోసం 'బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్' (Battery-as-a-Service, BaaS) కార్యక్రమాన్ని అందిస్తోంది. ఇప్పుడు 15 ఏళ్ల బ్యాటరీ వారంటీని తీసుకురావడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారులలో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేసింది.
"ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడం, ఎలక్ట్రిక్ కార్లపై కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం మా లక్ష్యం. బ్యాటరీ సాంకేతికత నాణ్యత & దీర్ఘకాలిక పనితీరుపై మాకు ఉన్న నమ్మకానికి ఈ వారంటీ నిదర్శనం" - కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ & మార్కెటింగ్ విభాగం అధికారి అతుల్ సూద్
ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ అత్యంత కీలకమైన భాగం. బ్యాటరీ సమస్యలకు అయ్యే ఖర్చు కూడా కొనుగోలుదారులను ఆలోచింపజేస్తుంది. ఈ నేపథ్యంలో.. 15 ఏళ్ల పాటు, కిలోమీటర్ల పరిమితి లేకుండా వారంటీ ఇవ్వడం కారెన్స్ క్లావిస్ ఈవీ కొనుగోలుదారులకు ముఖ్యమైన ప్రయోజనంగా మారనుంది. అయితే వారంటీ నిబంధనలు యజమానిని బట్టి, వాహనం కొనుగోలు తేదీ & అర్హతలను బట్టి మారతాయని గమనించాలి.
ఇది కూడా చదవండి: హై మైలేజ్ కారు వ్యాగన్ ఆర్.. నెలకు రూ.8,200 EMIతో! ఎంత లోన్ తీసుకోవాలి, ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి?
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















