యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!
హ్యుందాయ్ వెర్నా భారత మార్కెట్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. నాలుగు తరాల్లో ఈ సెడాన్‌లో వచ్చిన డిజైన్, ఇంజిన్ & ఫీచర్ల మార్పుల పూర్తి కథ ఇదే.

20 years of the Hyundai Verna: వెర్నా పేరు వినగానే గుర్తొచ్చేది హ్యుందాయ్. భారత కార్ మార్కెట్లో రెండు దశాబ్దాలుగా ఈ సెడాన్ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. 2006 సెప్టెంబర్ 25న, యాక్సెంట్‌కు వారసుడిగా భారత మార్కెట్లోకి వచ్చిన వెర్నా.. ఇప్పుడు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండు దశాబ్దాల్లో నాలుగు తరాలుగా రూపం మార్చుకుంది. ఇంజిన్లు, ఫీచర్లు, టెక్నాలజీలో ఎన్నో మార్పులు చూసింది. అయినా మధ్యతరహా సెడాన్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
తొలి తరం.. వెర్నాకు పునాది
2006లో వచ్చిన తొలి తరం వెర్నా 4.3 మీటర్లకు పైగా పొడవుతో ఆకట్టుకుంది. యాక్సెంట్ కంటే మరింత ప్రీమియం అనుభూతిని అందించింది. కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నాలుగు స్పీకర్ల ఆడియో వ్యవస్థ వంటి ఫీచర్లు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వెర్నాలో 103hp 1.6 లీటర్ పెట్రోల్ & 110hp 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండేవి. మొదట 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చాయి. తర్వాత డీజిల్ వెర్నాకు 4 స్పీడ్ ఆటోమేటిక్ కూడా అందించారు. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్ శక్తివంతమైన పనితీరు & మంచి మైలేజీతో పేరు తెచ్చుకుంది.
2010లో వెర్నా ట్రాన్స్‌ఫార్మ్ పేరుతో ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. కొత్త హెడ్ల్యాంపులు, గ్రిల్, బంపర్లు, చక్రాలు, టెయిల్ ల్యాంపులతో రూపం మారింది.
ఫ్లూయిడిక్ వెర్నా.. సంచలన డిజైన్
2011లో రెండో తరం వెర్నా వచ్చింది. ఫ్లూయిడిక్ డిజైన్‌తో ఈ కారు అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. పెద్ద పరిమాణం, తక్కువ ఎత్తు, ప్రత్యేక ఆకృతిలో హెడ్ల్యాంపులు & టెయిల్ ల్యాంపులు ఆకట్టుకున్నాయి.
1.4 లీటర్ & 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో పాటు 1.4 లీటర్ & 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉండేవి. వెనుక కెమెరా, 6 ఎయిర్‌బ్యాగులు, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి ఫీచర్లు దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
2015లో వెర్నా 4S పేరుతో ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. డిజైన్ మార్పులతో పాటు డీజిల్ ఇంజిన్లలో అప్డేట్ చేశారు.
ఇది కూడా చదవండి: కనీస డౌన్‌పేమెంట్‌తోనే కొత్త టాటా టిగోర్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.. పూర్తి ఫైనాన్స్ ప్లాన్ ఇదిగో
మూడో తరం.. ఫీచర్ల జోరు
2017లో మూడో తరం వెర్నా మార్కెట్లోకి వచ్చింది. ఎలాంట్రా స్ఫూర్తితో రూపొందించిన డిజైన్ దీనికి కొత్త రూపాన్ని ఇచ్చింది. వెన్టిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
1.6 లీటర్ పెట్రోల్ & డీజిల్ ఇంజిన్లతో ఇది అందుబాటులోకి వచ్చింది. రెండింటికీ మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.
2020లో వచ్చిన ఫేస్‌లిఫ్ట్‌తో పెద్ద మార్పు జరిగింది. కొత్త 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు వచ్చాయి. తొలిసారిగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా వెర్నాలో ప్రవేశపెట్టారు. 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్ దీనికి జత చేశారు.
ప్రస్తుత వెర్నా.. డీజిల్‌కు వీడ్కోలు
2023లో నాలుగో తరం వెర్నా వచ్చింది. ఈసారి డిజైన్ పూర్తిగా మారింది. ముందు భాగంలో పూర్తి వెడల్పు LED లైట్‌బార్, స్ప్లిట్ హెడ్ల్యాంపులు, వెనుక కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డీజిల్ ఇంజిన్‌కు మాత్రం ఈ తరంలో వీడ్కోలు పలికారు. 1.5 లీటర్ సహజ పెట్రోల్ & 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉన్నాయి. టర్బో వెర్షన్ 160hp శక్తిని అందిస్తుంది. లెవల్ 2 ADAS, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 8 స్పీకర్ల బోస్ ఆడియో వ్యవస్థ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: TVS Ronin కొనడానికి రూ.20,000 చాలు! తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధరలు & EMI వివరాలు ఇవిగో
2026లో ఫేస్‌లిఫ్ట్
2026లో మరోసారి ఫేస్‌లిఫ్ట్ వచ్చింది. బంపర్లు, అల్లాయ్ వీల్స్‌లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగులు వంటి ఫీచర్లు జోడించారు.
రూ.10.99 లక్షల నుంచి రూ.18.31 లక్షల వరకు ధరతో ఉన్న ప్రస్తుత వెర్నా.. 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో రూపాలు మార్చుకుంది. SUVల హవా పెరిగినా, భారత సెడాన్ మార్కెట్లో తన ఉనికిని కొనసాగిస్తోంది. అదే వెర్నా ప్రత్యేకత.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















