Honda Salls September 2025: హోండా బండ్లకు బంపర్ గిరాకీ - సెప్టెంబర్‌లో 5.68 లక్షల టూ వీలర్ల సేల్స్‌తో కొత్త రికార్డ్
Honda India, సెప్టెంబర్ 2025లో 5.68 లక్షల టూ వీలర్లను అమ్మి 6% నెలవారీ వృద్ధిని సాధించింది. దేశీయంగా 5.05 లక్షల యూనిట్లు, ఎగుమతుల్లో 62,471 యూనిట్లతో హోండా బలంగా ఉంది.

Honda September 2025 Two Wheeler Sales Report: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ కంపెనీ ఒకటైన హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI), సెప్టెంబర్ 2025లో భారీ అమ్మకాల రికార్డు సాధించింది. ఈ నెలలో మొత్తం 5,68,164 యూనిట్లు విక్రయించగా, ఇది గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే 5.44% వృద్ధి. 2024 సెప్టెంబర్‌లో హోండా 5,38,852 యూనిట్లు విక్రయించింది.
దేశీయ అమ్మకాలలో బలమైన పెరుగుదల
గత నెల (సెప్టెంబర్)లో, దేశీయ మార్కెట్‌లో 5,05,693 టూ వీలర్లు అమ్ముడవగా, మొత్తం అమ్మకాలలో ఇదే మేజర్ పోర్షన్. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగి 62,471 యూనిట్లను చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 47,174 యూనిట్లుగా ఉండగా, ఈసారి 32.43% వృద్ధి నమోదైంది.
మంత్లీ గ్రోత్ స్పష్టంగా కనిపించింది
ఆగస్ట్ 2025లో హోండా 5,34,861 యూనిట్లను విక్రయించింది. దీనితో పోలిస్తే, సెప్టెంబర్ 2025లో 6% నెలవారీ వృద్ధిని సాధించడం ఈ కంపెనీకి ఉత్సాహాన్నిచ్చింది. దేశీయ మార్కెట్‌లో 2.85% వార్షిక వృద్ధిని ఈ కంపెనీ సాధించింది.
ఈ ఏడాది మొత్తం (YTD) అమ్మకాలు
2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, అంటే ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి అర్ధభాగంలో, హోండా మొత్తం 29,91,024 యూనిట్లను విక్రయించింది. వీటిలో 26,79,507 యూనిట్లు దేశీయంగా విక్రయించగా, మిగిలిన 3,11,517 యూనిట్ల సేల్స్‌ను ఎగుమతుల ద్వారా రాబట్టింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంలోని (2024-25 మొదటి అర్ధభాగం) 31,13,596 యూనిట్లు విక్రయాలతో పోలిస్తే ఈసారి 3.94% తగ్గుదల కనిపించింది.
ప్రొడక్ట్ లాంచ్‌లు & ప్రత్యేక కార్యక్రమాలు
సెప్టెంబర్‌లో, హోండా ప్రీమియం 350cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో తన స్థాయిని పదిల పరుచుకోవడానికి కొత్త CB350C స్పెషల్ ఎడిషన్‌ను రూ. 2.02 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఈ బండి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న Honda BigWing షోరూమ్‌లలో లభ్యమవుతుంది. అదనంగా, కస్టమర్ల కోసం ‘MyHonda-India’ మొబైల్ యాప్ కూడా లాంచ్ చేసింది.
సామాజిక బాధ్యత కార్యక్రమాలు
సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా, Honda India Foundation (HIF) గుజరాత్ పోలీసులకు 50 ప్రత్యేకమైన Quick Response Team (QRT) వాహనాలను అందజేసింది. ఇది ‘సడక్ సహాయక్: సురక్షిత మార్గ్, సురక్షిత జీవన్’ ప్రాజెక్ట్‌లో భాగం. హోండా గ్లోబల్ విజన్ అయిన "2050 నాటికి ప్రమాదాలు లేని సమాజం" లక్ష్యానికి ఈ చర్యలు ముందడుగు అని కంపెనీ వెల్లడించింది.
అంతేకాదు, హోండా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ జాబితాలో తిరుపతి కూడా ఉండటం తెలుగు రాష్ట్రాల కస్టమర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దేశీయ మార్కెట్‌లో బలమైన అమ్మకాలు, ఎగుమతుల వృద్ధి, కొత్త మోడళ్ల లాంచ్‌లు, CSR కార్యక్రమాలతో హోండా సెప్టెంబర్ 2025ను గుర్తుంచుకునే నెలగా మార్చుకుంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో కంపెనీ మరింత బలంగా మార్కెట్‌ను నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.





















