GST తగ్గిన తర్వాత Maruti Alto, Swift, Dzire, Wagon R ధరలు ఏ మేరకు దిగి రావచ్చు? కొత్త అంచనా ధరలు ఇవిగో
GST Reduction Car Prices: చిన్న కార్లపై GST ని 28% నుంచి 18% కు తగ్గించడానికి మోదీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. మారుతి కొత్త కస్టమర్లు, ముఖ్యంగా చిన్న కార్లు కొనేవాళ్లు భలే బెనిఫిట్ పొందుతారు.

Maruti Car Price After GST Reduction 2025: ఈ దీపావళికి (Diwali 2025), కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, చిన్న కార్లు సహా అనేక వస్తువులపై GST (వస్తు, సేవల పన్ను) తగ్గించాలని యోచిస్తోంది. ప్రస్తుతం, మన దేశంలో చిన్న కార్లపై 28% GST & 1% సెస్, అంటే మొత్తం 29% పన్ను విధిస్తున్నారు. దీనిని 18% కు తగ్గిస్తే, కస్టమర్లకు నేరుగా 10% ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. ఉదాహరణకు, ఒక కారు ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ. 5 లక్షలు అయితే, 29% పన్ను జోడించిన తర్వాత అది రూ. 6.45 లక్షలు అవుతుంది. కానీ, GST ని 18% కు తగ్గిస్తే ధర రూ. 5.90 లక్షలు మాత్రమే అవుతుంది. అంటే కొనుగోలుదారు దాదాపు రూ. 55,000 ఆదా చేస్తాడు. ఈ లెక్కన, రూ. 10 లక్షల విలువైన కారు రేటు దాదాపు రూ. 1.10 లక్షల మేర తగ్గుతుంది. దీని అర్ధం... కస్టమర్‌కు దాదాపు రూ. 1.10 లక్షలు మిగులుతుంది, ఈ డబ్బుతో దసరా పండుగను "ధూంధాం"గా చెయొచ్చు.
తెలుగు ప్రజలకు ఎంత డబ్బు ఆదా అవుతుంది?
మారుతి సుజుకి ఆల్టోపై ఎంత ఆదా చేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో, Maruti Suzuki Alto K10 ప్రస్తుత ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.23 లక్షలు. ఇందులో 29% పన్ను అంటే రూ. 1.22 లక్షలు ఉన్నాయి. GST ని 18% కు తగ్గిస్తే, పన్ను రూ. 80,000 మాత్రమే అవుతుంది. అంటే తెలుగు ప్రజలకు ఆల్టో K10 పై రూ. 42,000 వరకు ఆదా అవుతుంది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
Maruti Suzuki Wagon R ప్రారంభ ధర రూ. 5.78 లక్షలు. ప్రస్తుతం దీనిపై దాదాపు రూ. 1.67 లక్షల పన్ను విధిస్తున్నారు. GST తగ్గింపు తర్వాత పన్ను రూ. 1.09 లక్షలకు తగ్గుతుంది. అంటే, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో వ్యాగన్ ఆర్ కొనుగోలుపై దాదాపు రూ. 58,000 ఆదా అవుతుంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త రేటు
Maruti Suzuki Swift ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు, ఇందులో దాదాపు రూ. 1.88 లక్షల పన్ను కూడా ఉంది. GST తగ్గిన తర్వాత పన్ను రూ. 1.23 లక్షలు మాత్రమే ఉంటుంది. అంటే స్విఫ్ట్ పై దాదాపు రూ. 65,000 సేవ్ అవుతుంది.
మారుతి సుజుకి డిజైర్ కొత్త ధర
Maruti Suzuki Dzire డిజైర్ ప్రస్తుత ధర రూ. 6.83 లక్షలు. దానిపై దాదాపు రూ. 1.98 లక్షల పన్ను విధించారు. జీఎస్టీ రిడక్షన్ తర్వాత ఈ పన్ను రూ. 1.29 లక్షలకు తగ్గవచ్చు. అంటే ఈ కారు, కస్టమర్లకు దాదాపు రూ. 68,000 వరకు చౌకగా వస్తుంది.
మారుతి బ్రెజ్జా & ఎర్టిగా మీద అడ్వాంటేజ్
Maruti Brezza ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు. ప్రస్తుతం దీనిపై రూ. 2.52 లక్షల పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ 18% కి తగ్గిన తర్వాత పన్ను రూ. 1.65 లక్షలు మాత్రమే. అంటే బ్రెజ్జా కొత్త కస్టమర్లు దాదాపు రూ. 87,000 మేర ప్రయోజనం పొందుతారు. మరోవైపు, Maruti Ertiga ప్రారంభ ధర రూ. 9.11 లక్షలు. ప్రస్తుతం, దీనికి రూ. 2.64 లక్షల పన్ను చెల్లిస్తున్నాం. కొత్త రేటు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పన్ను రూ. 1.73 లక్షలకు చేరుకుంటుంది. అంటే ఎర్టిగాపై దాదాపు రూ. 91,000 ఆదా అవుతుంది.
మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద బహుమతి
కేంద్ర ప్రభుత్వం నిజంగానే GST లో ఇంత పెద్ద కోత పెడితే, మధ్య తరగతి కుటుంబాలు కారు కొనడం సులభం అవుతుంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసేవాళ్లు ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ & డిజైర్ వంటి కార్లపై మంచి మొత్తంలో డబ్బు ఆదా చేసుకోగలరు. బ్రెజ్జా & ఎర్టిగా వంటి పెద్ద మోడళ్లపైనా రూ. 90,000 వరకు ఉపశమనం పొందవచ్చు.





















