Tata Punch Record: ఇండియాలో వేగంగా అమ్ముడవుతున్న SUV, కేవలం నాలుగేళ్లలో 6 లక్షల టాటా పంచ్ కార్లు అమ్మకం
Tata Punch New Milestone: మన దేశంలో, దిల్లీ-NCR పరిధిలో టాటా పంచ్ కారును ఎక్కువగా కొంటున్నారు. కాంపాక్ట్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Tata Punch - Fast Selling SUV In India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. టాటా పంచ్, ఈ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. అక్టోబర్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు, టాటా పంచ్ 6 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. కేవలం 4 సంవత్సరాల లోపులోనే 6 లక్షల యూనిట్ల మైలురాయిని సాధించిందంటే ఈ ఫోర్‌వీలర్ డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించవచ్చు. టాటా మోటార్స్, ఈ బడ్జెట్ రేటు కాంపాక్ట్ SUVని 2021 సంవత్సరంలో లాంచ్ చేసింది, ప్రారంభం నుంచే ఈ కారు బాగా అమ్ముడవుతోంది. ఇంకా, ఇది 2024లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచింది.
పంచ్ & పంచ్ EV రెండూ కలిపి, ప్రారంభ తేదీ నుంచి సాధించిన అమ్మకాల మైలురాళ్లు ఇవి:
అక్టోబర్ 2021లో లాంచ్ అయిన ఈ కారు, ఆగస్టు 2022లో, అంటే ప్రారంభమైన 11 నెలల్లో తొలి 1 లక్ష యూనిట్ల మైలురాయిని దాటింది. ఆ తర్వాత...
మే 2023 ----- 2 లక్షలు
డిసెంబర్ 2023 ----- 3 లక్షలు
జులై 2024 ----- 4 లక్షలు
జనవరి 2025 ----- 5 లక్షలు
జులై 2025 ----- 6 లక్షలు
టాటా మోటార్స్ ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి టాటా పంచ్ కు మంచి ఆదరణ లభిస్తోంది. దాని కాంపిటీటివ్ ప్రైస్ ట్యాగ్ (పోటీ ధర), ఫీచర్లతో లోడ్ చేసిన క్యాబిన్ & ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకురావడం ఈ బలమైన ఆకర్షణకు కారణంగా మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
హైదరాబాద్, విజయవాడలో ధర
భారత మార్కెట్లో టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Punch ex-showroom price) రూ. 6.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హైదరాబాద్ లేదా విజయవాడలో ఈ కాంపాక్ట్ SUVని దాదాపు రూ. 7.47 లక్షల ఆన్-రోడ్ ధరకు (Tata Punch on-road price) కొనవచ్చు.
Tata Punch కు 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 6,700 rpm వద్ద 87.8 PS పవర్ & 3,150 నుంచి 3,350 rpm వరకు 115 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ బండి ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలంటే టాటా పంచ్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలి.
టాటా పంచ్ మైలేజ్
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో, పెట్రోల్ వేరియంట్‌లో ఈ టాటా కారు ARAI సర్టిఫైడ్ మైలేజ్ 20.09 kmpl. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 18.8 kmpl మైలేజ్ ఇస్తుందని ARAI పేర్కొంది. పంచ్ పెట్రోల్ ఇంజిన్‌తోనే అందుబాటులో ఉంది, అయితే ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్‌తోనూ దీనిని పొందవచ్చు. టాటా పంచ్ CNG వెర్షన్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ 26.99 km/kg.
టాటా పంచ్ ఫీచర్లు
జర్నీని ఎంజాయ్ చేయడానికి ఈ టాటా కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అమర్చారు. కారులో 26.03 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణ సమయంలోనే మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. టాటా పంచ్ గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
టాటా పంచ్ EV
ప్రస్తుతం, టాటా పంచ్ EV కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. పంచ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభిస్తుంది, 365 కి.మీ. వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది.
టాటా మోటార్స్ ప్రకారం, FY25లో, ఈ బ్రాండ్ నుంచి మొత్తం ప్రయాణీకుల వాహన అమ్మకాలలో పంచ్ వాటా 36%.
పంచ్ & పంచ్ EV వేరియంట్‌లు రెండూ వరుసగా గ్లోబల్ NCAP & భారత్ NCAP నుంచి 5-స్టార్ భద్రత రేటింగ్ పొందాయి.





















