Car Safety Tips: ఈ పని చేయండి చాలు - మీ కారును ఎవడూ దొంగిలించలేడు!
Engine Locking System: ఇంజిన్ లాకింగ్ సిస్టమ్ మీ కారును దొంగతనం నుంచి రక్షిస్తుంది. ఈ వ్యవస్థ, సరైన కీ ఉంటేనే ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

Car Engine Locking Feature Details In Telugu: కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది మన కష్టార్జితం, భద్రతకు కూడా సంబంధించిన విషయం. మీ కష్టార్జితంతో కొన్న కారును కొన్ని నిమిషాల్లోనే ఎవరైనా దొంగిలిస్తే మీరు ఎంతో బాధపడతారు. ఈ బాధ మీకు ఉండకూడదనుకుంటే, స్మార్ట్‌గా ఆలోచించండి & సింపుల్ టెక్నాలజీని ఉపయోగించండి. ఇక మీ కారును కొట్టేయడం ఏ దొంగ వల్ల కూడా కాదు.
దొంగతనం నుంచి కార్లకు భద్రత కల్పించే టెక్నాలజీ పేరు - "ఇంజిన్ లాకింగ్ సిస్టమ్". ఇప్పుడు చాలా కార్లలో ఈ ఫీచర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ టెక్నాలజీ ఉన్న కారును కొట్టేయడం ఈజీ కాదని కొన్ని సంఘటనలు కూడా రుజువు చేశాయి.
ఇంజిన్ లాకింగ్ సిస్టమ్
ఇంజిన్ లాకింగ్ సిస్టమ్ అనేది ఒక స్మార్ట్ సేఫ్టీ టెక్నాలజీ. సరైన కీ, సిగ్నల్ లేదా ఆథరైజ్‌డ్ ఐడెంటిఫికేషన్ పొందే వరకు మీ కారు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి ఈ వ్యవస్థ అనుమతించదు. అంటే, ఎవరైనా మీ కార్ డోర్ లాక్‌ను బ్రేక్ చేసినప్పటికీ, నిజమైన గుర్తింపు పొందే వరకు అతను ఇంజిన్ స్టార్ట్ చేయలేడు.
రియల్ టైమ్ లొకేషన్
ఇంజిన్ లాకింగ్ సిస్టమ్‌లో ఉన్న మరో ప్రత్యేకత - మీరు దీనిని మొబైల్ యాప్ లేదా రిమోట్ ద్వారా ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయవచ్చు. మీ కారు పబ్లిక్ ప్లేస్‌లో లేదా అంతగా సురక్షితం కాని ప్రదేశంలో పార్క్ చేసినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీరు, కారు ఇంజిన్‌ను ఒక్క క్లిక్‌తో లాక్ చేయవచ్చు. ఈ సిస్టమ్‌ను ఉపయోగించి, మీ కారు రియల్ టైమ్ లొకేషన్‌ను కూడా మీరు ఈజీగా ట్రాక్ చేయవచ్చు.
ఇంజిన్ లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
ఇంజిన్ లాకింగ్ వ్యవస్థను, కారు ప్రధాన నియంత్రణ కేంద్రమైన ECU (ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్)కి అనుసంధానిస్తారు. RFID చిప్ ఉన్న కీ, మొబైల్ యాప్ నుంచి పంపే సిగ్నల్ లేదా అథరైజ్‌డ్ పర్సన్ నుంచి వచ్చిే ఆదేశం వంటివాటికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఇవి లేకపోతే ECU ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి అనుమతించదు. ఈ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం RFID కీ, దీనికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. లొకేషన్‌ను ట్రాక్ చేసే GPS మాడ్యూల్, ఇంజిన్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయగల మొబైల్ యాప్ కంట్రోల్, ఇంజిన్ ఇంధన వ్యవస్థ లేదా ఇగ్నిషన్‌ను నియంత్రించే రిలే కంట్రోల్ యూనిట్ దీనిలో భాగం. అనధికార వ్యక్తి కారును స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ వ్యవస్థ వెంటనే ఇంజిన్‌ను లాక్ చేస్తుంది & కారు ఓనర్‌కు ఒక హెచ్చరికను కూడా పంపుతుంది.
కారు దొంగతనాన్ని నివారించడానికి స్మార్ట్ చిట్కాలు
1. ఇంజిన్ లాక్‌ను సరిగ్గా ఉపయోగించండి
2. GPS ట్రాకర్ ఇన్‌స్టాల్ చేసుకోండి
3. ఆఫ్టర్ మార్కెట్ ఇంజిన్ లాకింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయండి
4. రిమోట్ కట్-ఆఫ్ సిస్టమ్‌ను ఉపయోగించండి
టెక్నాలజీని మీరు స్మార్ట్‌గా ఉపయోగిస్తే, ఏ దొంగ కూడా మీ కారును అంగుళం కూడా కదపలేడు.





















