Advance Tip: ఓలా, ఉబర్, ర్యాపిడోలకు భారీ షాక్! 'అడ్వాన్స్ టిప్ ఆప్షన్' రద్దు కానుందా? CCPA సీరియస్!
Advance Tip For Cab Booking: ఓలా, ఉబర్ & ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు ప్రయాణం ప్రారంభించే ముందు 'టిప్' అడగడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి CCPA దర్యాప్తు చేస్తోంది.

Advance Tip Option While Cab Booking: నగరాలు లేదా పట్టణాల్లో ప్రయాణాలకు క్యాబ్‌లు చాలా ఉపయోగపడతాయి. అయితే.. జనం అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓలా, ఉబర్ & ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు రెచ్చిపోతున్నాయి. కేవలం తమ వ్యాపార వృద్ధే లక్ష్యంగా సాధారణ జనాన్ని ఇబ్బంది పెట్టే విధానాలను తరచూ తీసుకొస్తున్నాయి. అలాంటి ఇబ్బందికర విధానాల్లో ఒకటి - 'ముందస్తు టిప్ ఆప్షన్' (Advance Tip option in cab booking). ఇది ఆప్షనే అయినప్పటికీ, ప్రయాణీకుల పాలిట శాపంగా మారింది. దీనిపై ప్రయాణీకులు తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ విధానంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) దర్యాప్తు కూడా కొనసాగుతోంది, క్యాబ్ కంపెనీలకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
ఏమిటీ 'అడ్వాన్స్ టిప్ ఆప్షన్'?
సాధారణంగా.. ప్రజలు ఓలా, ఉబర్ లేదా ర్యాపిడోలో రైడ్ బుక్ చేసుకునేటప్పుడు డ్రైవర్‌కు టిప్ ఇస్తుంటారు. డ్రైవర్ మాటతీరు, ప్రవర్తన, బండి కండిషన్, గమ్యస్థానానికి చేర్చిన సమయం వంటి విషయాల ఆధారంగా.. గమ్యస్థానానికి చేరిన తర్వాత ఇష్టమైనతే ఈ టిప్ ఇస్తారు. డ్రైవర్ లేదా వాహనం కారణంగా కస్టమర్ ఏదైనా ఇబ్బంది పడితే టిప్ ఇవ్వరు. ఇప్పుడు.. ఈ సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. గమ్యస్థానం చేరిన తర్వాత ఇవ్వాల్సిన 'డ్రైవర్ టిప్'ను, కార్ బుక్ చేసేటప్పుడే, అంటే ప్రయాణం ప్రారంభించడానికి ముందే ఇచ్చేలా ఒక ఆప్షన్ తీసుకొచ్చాయి ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలు. ఇదే 'అడ్వాన్స్ టిప్ ఆప్షన్'. ఈ మూడు కంపెనీల యాప్‌ల్లో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దీనివల్ల, ముందస్తు టిప్ ఇస్తేనే లేదా ఎక్కువగా ఇస్తేనే డ్రైవర్లు రైడ్ కోసం వస్తున్నారు. టిప్ ఇవ్వకపోయినా లేదా టిప్ తక్కువగా ఇచ్చారని భావించినా రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు లేదా రైడ్‌ను యాక్సెప్ట్ చేయడం లేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తమకు ఇష్టం లేకపోయినా ఎక్కువ టిప్ ఆఫర్ చేయాల్సి వస్తోంది.
సీరియస్ అయిన CCPA
ఈ ఆప్షన్ మీద కంప్లైంట్లు వెళ్లడంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సీరియస్ అయింది. క్యాబ్ అగ్రిగేటర్లు అవలంబిస్తున్న ఇలాంటి అన్యాయమైన వ్యాపార విధానాలపై CCPA దర్యాప్తు ప్రారంభించింది, గత నెల 16న (మే 16, 2025) ఈ మూడు కంపెనీలకు నోటీసులు పంపింది & దీనికి సంబంధించి సమాధానం కోరింది. అయినప్పటికీ, అడ్వాన్స్ టిప్ ఆప్షన్‌ను తొలగించడానికి ఈ కంపెనీలు నిరాకరించాయి. CCPA దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు జరిమానా విధించవచ్చని తెలుస్తోంది.
క్యాబ్ అగ్రిగేటర్లు ఏం చెబుతున్నాయి?
ఈ మొత్తం విషయంలో క్యాబ్ అగ్రిగేటర్ల వాదన వింతగా ఉంది. అడ్వాన్స్ టిప్ అనేది అన్యాయమైన వ్యాపార పద్ధతి కాదని చెబుతున్నాయి. ఇది ఐచ్ఛికమేనని, టిప్ ఇవ్వడానికి కస్టమర్లు నిరాకరించవచ్చని వాదించాయి. ఈ వాదనలపైనా CCPA దర్యాప్తు జరుగుతోంది & ఇది కస్టమర్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో, రాదో అని తేల్చే పనిలో ఉంది. ఇంకా.. అడ్వాన్స్ టిప్ ఆప్షన్‌తో కస్టమర్లను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారా అని కూడా ఆరా తీస్తోంది.
CNBC ఆవాజ్ రిపోర్ట్ ప్రకారం, దోషులుగా తేలితే ఈ మూడు క్యాబ్ కంపెనీలకు భారీగా జరిమానా విధించవచ్చు. అడ్వాన్స్ టిప్ ఆప్షన్‌ను తొలగించమని కూడా ఆదేశించవచ్చు. ఇదే జరిగితే, 'అడ్వాన్స్ టిప్' ఆప్షన్ ఇకపై కనిపించదు.
కేంద్రం కూడా సీరియస్
గతంలో, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ముందస్తు టిప్ ఆప్షన్ మీద అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను అనైతికమైనది & దోపిడీ లాంటిదని అభివర్ణించారు. క్యాబ్ త్వరగా బుక్ కావాలంటే ముందస్తు టిప్ ఇవ్వమని ప్రయాణీకులను బలవంతం చేయడం అన్యాయమైన వ్యాపార విధానాల పరిధిలోకి వస్తుందని అన్నారు. టిప్ అనేది సర్వీస్‌కు ప్రశంసగా ఉంటుందే గానీ అది హక్కుగా మారదని స్పష్టం చేశారు.





















