ఈ స్కూటర్ ఎక్కితే, కింద పడిపోతామనే భయం ఉండదు! స్టాండ్ అవసరం లేని BMW Vision CE ఎలక్ట్రిక్ స్కూటర్
బీఎండబ్ల్యూ మోటరాడ్ విజన్ సీఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారత్‌లో డిజైన్ పేటెంట్ దాఖలైంది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వ్యవస్థ, రక్షణ కేజ్‌తో వస్తున్న ఈ కాన్సెప్ట్ స్కూటర్ ప్రత్యేకతలు తెలుసుకోండి.

BMW self-balancing electric scooter: స్కూటర్ ఆగినప్పుడు కింద కాలు పెట్టాల్సిన అవసరం లేకుండా దానంతట అదే నిలబడితే ఎలా ఉంటుంది? పైగా హెల్మెట్ అవసరం లేని ప్రయాణం కూడా అదే స్కూటర్ అందిస్తే.. ఈ ఆలోచనకు రూపమిస్తోంది బీఎండబ్ల్యూ మోటరాడ్. తన విజన్ సీఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌కు భారత్‌లో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. దీంతో ఈ వినూత్న స్కూటర్‌పై ఆసక్తి పెరిగింది. అయితే, భారత్‌లో ఈ స్కూటర్ విడుదల ఖాయమైందని ఇప్పుడే చెప్పలేం.
వినూత్న డిజైన్‌తో Vision CE
బీఎండబ్ల్యూ మోటరాడ్ విజన్ సీఈ కాన్సెప్ట్‌ను 2025లో జరిగిన IAA మొబిలిటీ షోలో తొలిసారిగా ఆవిష్కరించింది. నగరాల్లో ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చాలన్న లక్ష్యంతో ఈ నమూనాను రూపొందించింది. సాధారణ స్కూటర్లకు భిన్నంగా ఇందులో ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ లోహపు గొట్టాలతో రూపొందించిన సేఫ్టీ కేజ్. దీనికి అనుసంధానంగా నాలుగు పాయింట్ల సీటుబెల్ట్‌ను అందించారు. ప్రమాదాల సమయంలో ప్రయాణికుడికి అదనపు రక్షణ కల్పించాలన్నది ఈ రూపకల్పన వెనుక ఉన్న ఆలోచన. ఈ వ్యవస్థతో హెల్మెట్, సాధారణ రైడింగ్ రక్షణ పరికరాలు లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంటుందని కంపెనీ తన కాన్సెప్ట్‌లో సూచించింది. అయితే, ఇది కంపెనీ ప్రతిపాదించిన ఆలోచన మాత్రమే. వాస్తవ వినియోగంలో భద్రత, చట్టపరమైన నిబంధనలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
ఇది కూడా చదవండి: Bajaj Pulsar N250SS: రూ.1.59 లక్షలకే 25hp పవర్.. కొత్త పల్సర్ N250SSలో ఈ ఫీచర్లు అదుర్స్!
25 ఏళ్ల క్రితమే ఇలాంటి ఆలోచన
బీఎండబ్ల్యూ గతంలోనూ ఇలాంటి ప్రయోగం చేసింది. సుమారు 25 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన C1 స్కూటర్‌లోనూ సేఫ్టీ కేజ్, సీటుబెల్ట్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. సాధారణ ద్విచక్ర వాహనాల తరహాలో కాకుండా, ప్రయాణికుడికి అదనపు రక్షణ కల్పించే విధంగా దాన్ని రూపొందించింది. ఇప్పుడు విజన్ సీఈతో అదే ఆలోచనను విద్యుత్ వాహనాల కాలానికి అనుగుణంగా మరోసారి ముందుకు తీసుకొచ్చింది.
ఆగినా కింద పడదు.. ఇదే ప్రత్యేకత
విజన్ CEలో మరో కీలకమైన ఫీచర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వ్యవస్థ. సాధారణ ద్విచక్ర వాహనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు, బ్యాలెన్స్ కోసం రైడర్ కాలు కింద పెట్టాలి. కానీ ఈ కాన్సెప్ట్ స్కూటర్ ఆగిన స్థితిలోనూ తన బ్యాలెన్స్‌ను కాపాడుకునేలా రూపొందించారు. దీంతో ప్రతిసారి కాలు కింద పెట్టాల్సిన అవసరం ఉండదని కంపెనీ వెల్లడించిన కాన్సెప్ట్ స్పష్టం చేస్తోంది. అయితే, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది? దాని పనితీరు ఎంతవరకు సమర్థంగా ఉంటుంది? వంటి వివరాలను బీఎండబ్ల్యూ ఇంకా వెల్లడించలేదు.
ఎలక్ట్రిక్ డ్రైవ్.. వివరాలు మాత్రం గోప్యం
విజన్ సీఈలో కాలుష్య ఉద్గారాలు విడుదల చేయని ఎలక్ట్రిక్ డ్రైవ్‌ను ఉపయోగించనున్నారు. అయితే, బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ప్రయాణించగల దూరం, గరిష్ఠ వేగం, మోటార్ శక్తి వంటి వివరాలను కంపెనీ ప్రకటించలేదు. ఈ స్కూటర్ రూపకల్పనలో తక్కువ ఎత్తులో ఉండే నిర్మాణం, పొడవైన వీల్‌బేస్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోనూ ఇలాంటి రూపకల్పన లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: RC Renewal: గడువు ముగిసిన RC రెన్యువల్ చేయకపోతే భారీ జరిమానా.. పారివాహన్ పోర్టల్‌లో ఇలా అప్లై చేయండి!
భారత్‌లో విడుదల ఎప్పుడంటే?
BMW మోటరాడ్ ఇప్పటికే భారత్‌లో CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.15.25 లక్షలు. ఈ నేపథ్యంలో విజన్ CE పేటెంట్ దాఖలు ఆసక్తికరంగా మారింది. అయితే, డిజైన్ పేటెంట్ దాఖలు చేసినంత మాత్రాన ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారని అర్థం కాదు. కొత్త డిజైన్‌పై హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తులో దాని వినియోగ అవకాశాలను పరిశీలించడం వంటి కారణాలతోనూ కంపెనీలు పేటెంట్లు దాఖలు చేస్తాయి.
విజన్ సీఈ ఇప్పటికే ఇతర మార్కెట్లలోనూ పేటెంట్ ప్రక్రియలో కనిపించింది. భారత్‌లోనూ ఈ డిజైన్‌కు పేటెంట్ దాఖలు చేయడం కంపెనీ ఆసక్తిని సూచిస్తోంది. కానీ భారత్‌లో విడుదల తేదీ, ధర, సాంకేతిక వివరాలు, ఉత్పత్తి ప్రణాళికపై బీఎండబ్ల్యూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి విజన్ సీఈ వెహికల్‌ను భవిష్యత్తుకు సంబంధించిన ఒక వినూత్న కాన్సెప్ట్‌గా చూడాలి. ఇది ఎప్పుడు ఉత్పత్తి దశకు చేరుతుంది? భారత మార్కెట్లోకి వస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే బీఎండబ్ల్యూ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















