Bike Sales Report: తగ్గిపోయిన 150 సీసీ, 200 సీసీ బైకుల అమ్మకాలు - టాప్‌లో ఏముందో తెలుసా?
2023 సెప్టెంబర్‌లో బైక్ సేల్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి. బజాజ్ పల్సర్ మాత్రం టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Bike Sales Report September 2023: భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమలోని 150 సీసీ నుంచి 200 సీసీ వరకు సెగ్మెంట్ 2023 సెప్టెంబర్‌లో వార్షిక అమ్మకాలలో 17.03 శాతం భారీ క్షీణతను నమోదు చేసింది. భారతీయ మోటార్‌సైకిల్ కస్టమర్‌ల్లో మారుతున్న ప్రాధాన్యతల కారణంగా కొత్త అమ్మకాల గణాంకాలు ఉండవచ్చు.
ముందంజలో పల్సర్
బజాజ్ పల్సర్ 2023 సెప్టెంబర్‌లో 46,888 యూనిట్ల అమ్మకాలతో 150 సీసీ నుంచి 200 సీసీ విభాగంలో అగ్రగామిగా ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే 2023 సెప్టెంబర్‌లో 3.13 శాతం స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ విభాగంలో ఇది 30.99 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్‌తో పోల్చితే టీవీఎస్ అపాచీ, హోండా యునికార్న్ రెండిటి అమ్మకాలలో గణనీయమైన క్షీణత కనిపించింది. టీవీఎస్ అపాచీ అమ్మకాలు 26,774 యూనిట్ల అమ్మకాలతో 37.67 శాతం క్షీణించగా, హోండా యునికార్న్ అమ్మకాలు 25,514 యూనిట్లతో 29.44 శాతం తగ్గాయి.
ఎఫ్‌జెడ్ అమ్మకాలు డౌన్, ఆర్15 అమ్మకాలు అప్
గత నెలలో యమహా ఎఫ్‌జెడ్, ఆర్15 సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. యమహా ఎఫ్‌జెడ్ అమ్మకాలు 27.29 శాతం క్షీణించి 14,872 యూనిట్ల వద్ద ఉండగా, ఆర్15 అమ్మకాలు గత సంవత్సరంతో 16.55 శాతం వృద్ధితో 11,131 యూనిట్లకు చేరుకుంది. ఎఫ్‌జెడ్ అమ్మకాలు క్షీణించినప్పటికీ, R15 7.36% మార్కెట్ వాటాను కొనసాగించింది.
ఈ విభాగంలో 3,852 యూనిట్ల విక్రయాలతో హోండా హార్నెట్ 2.0 గతేడాదితో పోలిస్తే 458.26 శాతం ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది. 150 సీసీ నుంచి 200 సీసీ సెగ్మెంట్‌లోని ఇతర మోడళ్లలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్/200, కేటీయం 200, హీరో ఎక్స్‌పల్స్ 200, బజాజ్ అవెంజర్ ఉన్నాయి. ఇవన్నీ గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల్లో క్షీణతను నమోదు చేశాయి.
ఈ తగ్గుదల ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల జరిగి ఉండవచ్చు. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిపై ఒత్తిడి తెచ్చింది. ఇది కాకుండా సెమీకండక్టర్ల కొరత కారణంగా సప్లై చెయిన్ ప్రభావితం అయింది.
రాబోయే నెలల్లో 150 సీసీ నుంచి 200 సీసీ విభాగంలో మోటార్‌సైకిల్ పరిశ్రమ నిరంతర సవాళ్లను ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మాంద్యం ఉన్నప్పటికీ భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో చాలా పోటీ ఉంది. అలాగే తయారీదారులు కూడా మార్కెట్ వాటాను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda) భారతదేశంలో ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90,567గా నిర్ణయించారు. ఈ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత సమయం వరకు కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ బైక్ షార్ప్, స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ 123.94 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్ 6, ఓబీడీ2 కంప్లైంట్ పీజీఎం-ఎఫ్ఐ ఇంజన్‌తో వచ్చింది. ఈ బైక్ భారతీయ మార్కెట్లో టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ 125లతో పోటీ పడనుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial