Bharat NCAP 2.0 రూల్స్ - కార్లకు మరింత కఠినమైన క్రాష్ టెస్టులు, స్టార్ రేటింగ్ కూడా టఫ్
భారత్ NCAP 2.0 కింద ఐదు క్రాష్ టెస్టులు, కఠినమైన స్కోరింగ్, కొత్త సేఫ్టీ పిల్లర్‌లు, తప్పనిసరి ESC & కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో భారత కార్ల సేఫ్టీ రేటింగ్ వ్యవస్థ పూర్తిగా మారబోతోంది.

Bharat NCAP 2.0 Draft Rules: భారతదేశంలో తయారయ్యే కార్ల భద్రత ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) కొత్తగా Bharat NCAP 2.0 డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. 2027 నుంచే అమల్లోకి రానున్న ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్, కార్ల సేఫ్టీ అంచనాలను పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం ఉన్న భారత్ ఎన్‌క్యాప్ నిబంధనల కంటే ఇవి మరింత కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా.. క్రాష్ ప్రొటెక్షన్, వాహనం నడిపే విధానం, ప్రమాదాల నివారణ, ప్రమాదం తరువాత సేఫ్టీ వంటి విభాగాల్లో కారుపై పూర్తి స్థాయి అంచనా విధానాన్ని తీసుకొస్తాయి.
ఐదు కొత్త సేఫ్టీ పిల్లర్‌లు - స్కోరింగ్ వ్యవస్థలో పెద్ద మార్పు
Bharat NCAP 2.0లో రేటింగ్‌లు మొత్తం 100 పాయింట్ల ఆధారంగా ఇస్తారు. ఈ పాయింట్లను ఐదు ప్రధాన విభాగాలుగా విభజించారు:
- ప్రమాద రక్షణ (Crash Protection) – 55%
- దుర్బల రహదారి వినియోగదారుల రక్షణ (Vulnerable Road-User Protection) – 20%
- సురక్షితమైన డ్రైవింగ్ (Safe Driving) – 10%
- ప్రమాద నివారణ (Accident Avoidance) – 10%
- ప్రమాదం తర్వాత భద్రత (Post-Crash Safety) – 5%
అంటే, ఇకపై, కేవలం ఫ్రంట్ ప్రొటెక్షన్ టెస్టు & చైల్డ్ ప్రొటెక్షన్ టెస్టుపై ఆధారపడే పాత విధానం పూర్తిగా మారిపోబోతోంది.
తప్పనిసరి కానున్న సేఫ్టీ ఫీచర్లు
కొత్త నిబంధనల ప్రకారం, స్టార్ రేటింగ్ పొందాలంటే ప్రతి కారులో కచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన భద్రత ఏర్పాట్లు:
- ESC (Electronic Stability Control) తప్పనిసరి
- కర్టైన్ ఎయిర్‌బాగ్స్ తప్పనిసరి
- AEB (Autonomous Emergency Braking) ఐచ్ఛికం
- సైడ్-ఫేసింగ్ సీట్లు ఉన్న మోడళ్లకు రేటింగ్ ఇవ్వరు
ఇవి అమల్లోకి వస్తే, 2027 తర్వాత విడుదలయ్యే కార్లలో ప్రాథమికంగా ఉండే భద్రతా ప్రమాణాలు భారీగా మెరుగుపడతాయి.
ఐదు క్రాష్ టెస్టులతో మరింత వాస్తవిక పరీక్షలు
ఇంతకుముందు కంటే విస్తృతంగా, మరింత రియల్-వరల్డ్ సిట్యువేషన్‌లను ప్రతిబింబించేలా Bharat NCAP 2.0లో మొత్తం ఐదు క్రాష్ టెస్టులు నిర్వహిస్తారు:
- 64 kmph ఆఫ్‌సెట్ ఫ్రంటల్ ఇంపాక్ట్
- 50 kmph ఫుల్-లిడ్త్ ఫ్రంటల్ ఇంపాక్ట్
- 50 kmph మొబైల్ లాటరల్ బారియర్ ఇంపాక్ట్
- 32 kmph ఆబ్లిక్ పోల్ సైడ్ ఇంపాక్ట్
- 50 kmph మొబైల్ రిజిడ్ రియర్ ఇంపాక్ట్
ఈ టెస్టులు కార్లను ముందు వైపు, వెనుక వైపు, పక్కన & మూల కోణాల నుంచి పరీక్షించే విధంగా రూపొందించారు.
సేఫ్టీ రేటింగ్స్ పొందడం ఇక కష్టమే
2027–29 మధ్య కాలంలో కారు 5 Star సేఫ్టీ రేటింగ్ పొందాలంటే కనీసం 70 పాయింట్లు తప్పనిసరి
2029–31 మధ్య కాలంలో 5 Star రేటింగ్ కోసం కనీసం 80 పాయింట్లు అవసరం
అంటే రాబోయే కార్లలో రేటింగ్‌లు సాధించడానికి కంపెనీలు మరింత శక్తిమంతమైన సేఫ్టీ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది.
అమలు ఎప్పుడు?
ఇవన్నీ ముసాయిదా నిబంధనలు. అంటే వీటిలో మార్పులు, చేర్పులు చేయవచ్చు. ఈ డ్రాఫ్ట్‌పై ప్రజలు, పరిశ్రమ నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించారు. 2027 అక్టోబర్ నుంచి Bharat NCAP 2.0 అధికారికంగా అమల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.






















