సింగిల్ ఛార్జ్‌తో 113km రేంజ్ ఇచ్చే స్టైలిష్ Bajaj Chetak C25 కొంటే రూ.4,299 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్!
Bajaj Chetak C25 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.4,299 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఉంది. 2.5kWh బ్యాటరీ, 113km రేంజ్, మెటల్ బాడీతో నగర ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

Bajaj Chetak C25 Electric Scooter: బజాజ్ ఆటో తాజాగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Bajaj Chetak C25 రిటైల్ అమ్మకాలను భారతదేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా, తొలి 10,000 మంది కస్టమర్లకు ప్రత్యేకంగా రూ.4,299 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ప్రకటించింది. దీనివల్ల ఈ స్కూటర్ ధర ఇప్పుడు రూ.87,100 (ఎక్స్-షోరూమ్ ధర)గా మారింది. అసలు ధరను రూ.91,399 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం రూపొందించిన ఈ Chetak C25, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లైనప్‌లో 30, 35 సిరీస్‌లతో పాటు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ మోడల్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కుటుంబాలకు ఇది సరైన ఎంపికగా బజాజ్ భావిస్తోంది.
డిజైన్ & క్వాలిటీ
చేతక్ C25 పూర్తిగా కొత్త చాసిస్‌పై వచ్చినప్పటికీ, డిజైన్ చూసిన వెంటనే ఇది చేతక్ అని గుర్తించేలా బజాజ్ స్టైల్‌ను కొనసాగించారు. ప్రతి ప్యానెల్‌ను కొత్తగా డిజైన్ చేశారు. సైడ్, రియర్ భాగాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందూ వెనకా LED లైటింగ్ ఇవ్వడంతో స్కూటర్ లుక్ షార్ప్‌గా కనిపిస్తుంది.
మెటల్ బాడీ ఉండటంతో బిల్డ్ క్వాలిటీపై నమ్మకం కలుగుతుంది. ధర తగ్గించినా చీప్‌గా ఉందన్న భావన ఎక్కడా రాదు.
ఫీచర్లు & ఉపయోగకరమైన అంశాలు
చేతక్ C25లో రివర్స్ LCD డిస్‌ప్లే ఉంది. ఇందులో బ్యాటరీ ఛార్జ్, మిగిలిన రేంజ్, స్పీడ్, రైడింగ్ మోడ్ వంటి అవసరమైన సమాచారం స్పష్టంగా చూపిస్తుంది. ఎండలో కూడా డిస్‌ప్లే చదవడానికి ఇబ్బంది ఉండదు.
ముందు భాగంలో రెండు ఓపెన్ స్టోరేజ్ క్యూబీలు, బ్యాగ్ హుక్ ఉన్నాయి. అండర్‌సీట్ స్టోరేజ్ 25 లీటర్లకు పరిమితమైనా, ఒక పెద్ద ఫుల్ ఫేస్ హెల్మెట్ సులభంగా సరిపోతుంది.
బ్యాటరీ & రేంజ్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.5kWh బ్యాటరీ ఇచ్చారు. కంపెనీ ప్రకారం IDC రేంజ్ 113 కిలోమీటర్లు. వాస్తవ వినియోగంలో సుమారు 85-90 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ 15 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు స్కూటర్ ఆటోమేటిక్‌గా ఎకో మోడ్‌కు మారుతుంది.
750 వాట్ పోర్టబుల్ ఛార్జర్‌తో సుమారు 3 గంటల 45 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. సీట్ కింద ఛార్జింగ్ పోర్ట్ ఉండటం రోజువారీ వినియోగంలో సౌకర్యంగా ఉంటుంది.
పనితీరు & కంఫర్ట్
చేతక్ C25లో కొత్త హబ్ మోటార్ ఉంది. ఇది 2.2kW పీక్ పవర్ ఇస్తుంది. గరిష్ట వేగం 55 కిలోమీటర్లు. సంఖ్యల పరంగా పెద్దగా అనిపించకపోయినా, నగర ట్రాఫిక్‌లో మాత్రం స్కూటర్ చురుకుగా స్పందిస్తుంది.
మొత్తం బరువు కేవలం 108 కిలోలు మాత్రమే కావడంతో నడపడం చాలా ఈజీ. సీట్ ఎత్తు 763 మిల్లీమీటర్లు కావడంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా ఇది నమ్మకంగా అనిపిస్తుంది.
ముందు డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్‌తో బ్రేకింగ్ సేఫ్‌గా ఉంటుంది.
తక్కువ ఖర్చుతో, నమ్మకమైన, సింపుల్‌గా నడపగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి Bajaj Chetak C25 మంచి ఎంపికగా నిలుస్తోంది. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ కారణంగా ప్రస్తుతం ఈ స్కూటర్ మరింత ఆకర్షణీయంగా మారింది. నగర ప్రయాణాలకు ఒక ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే, చేతక్ C25ని ఖచ్చితంగా పరిశీలించాల్సిందే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















