ఛార్జింగ్ వర్రీ లేకుండా సాగిపో, ఇప్పుడు 395 నగరాల్లో 5000 Ather ఫాస్ట్ ఛార్జర్లు - హైదరాబాద్‌లోనూ ఎక్కువే!
ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 5000 మార్క్‌ను దాటింది. 395 నగరాల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు నేపాల్, శ్రీలంక వరకు విస్తరించింది.

Ather Fast Charger Network Hyderabad Vijayawada: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో EV వినియోగదారులకు అత్యంత కీలకమైన అంశం ఛార్జింగ్ సదుపాయాల విస్తరణ. ఈ దిశగా, ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఒక కీలక మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ 5000 మార్క్‌ను దాటిందని ఏథర్ అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 5000కి పైగా ఫాస్ట్ ఛార్జర్లు
ఏథర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 5000కి పైగా ఫాస్ట్ ఛార్జర్లలో 3,675 ఛార్జర్లు నేరుగా ఏథర్ ఎనర్జీ నిర్వహిస్తున్నవే. మిగతా 1,400కి పైగా ఛార్జర్లు భాగస్వామ్య సంస్థల ద్వారా నెట్‌వర్క్ పరిధిలోకి వచ్చాయి. ఈ భాగస్వామ్య నెట్‌వర్క్‌లో హీరో విడా, మ్యాటర్ వంటి ఇతర OEMలు, అలాగే బోల్ట్, కజామ్, ఈవాంప్ వంటి ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు ఉన్నారు.
LECCS కనెక్టర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫాస్ట్ ఛార్జర్లు అన్నీ LECCS (Light Electric Combined Charging System) కనెక్టర్‌ను స్టాండర్డ్‌గా ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల వేర్వేరు బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ఒకే విధమైన ఛార్జింగ్ సౌలభ్యం లభిస్తోంది. ఇది భారతదేశ EV ఎకోసిస్టమ్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న గ్రిడ్
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలు ఇప్పుడు ఏథర్ ఫాస్ట్ ఛార్జర్లతో నిండిపోతున్నాయి. హైదరాబాద్, పుణె, చెన్నై, దిల్లీ, ముంబై వంటి నగరాల్లో... ఒక్కో నగరంలోనూ 100కి పైగా ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఏథర్‌కు హోమ్ సిటీ అయిన బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క నగరంలోనే 240కి పైగా ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి. రోజూ ఆఫీస్‌కి వెళ్లే EV యూజర్లకు ఇది పెద్ద ఊరటగా మారింది.
టైర్-2 నగరాల్లో కూడా గణనీయమైన విస్తరణ
ఏథర్ నెట్‌వర్క్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. నాసిక్, మలప్పురం, ఇండోర్ వంటి టైర్-2 నగరాల్లో కూడా 45కి పైగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కోజికోడ్, కోయంబత్తూర్ నగరాల్లో అయితే 65కి పైగా ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి. ఇది చిన్న నగరాల్లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నమ్మకాన్ని పెంచుతోంది.
తమిళనాడులో ప్రత్యేకంగా 400కి పైగా ఛార్జర్లు
ఈ ఏడాది ప్రారంభంలోనే ఏథర్ మరో కీలక ప్రకటన చేసింది. తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 400కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ఛార్జర్లు 38 నగరాలను కవర్ చేస్తూ, కోయంబత్తూర్-బెంగళూరు, మదురై-కన్యాకుమారి వంటి ముఖ్యమైన ఇంటర్‌సిటీ రూట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
అంతర్జాతీయంగా కూడా అడుగులు
భారతదేశంతో పాటు ఏథర్ తన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అంతర్జాతీయంగా కూడా విస్తరించింది. ప్రస్తుతం నేపాల్, శ్రీలంక దేశాల్లో 30కి పైగా ఫాస్ట్ ఛార్జర్లు పని చేస్తున్నాయి. ఇది ఏథర్ బ్రాండ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెస్తోంది.
సిటీల మధ్య భయం లేని ప్రయాణాలు
395 నగరాలకు పైగా విస్తరించిన ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి పెద్ద ధైర్యాన్ని ఇస్తోంది. రేంజ్ భయం తగ్గడమే కాకుండా, లాంగ్ రైడ్స్, ఇంటర్‌సిటీ ప్రయాణాలు కూడా ఇప్పుడు సులభమవుతున్నాయి. భవిష్యత్తులో EV వినియోగం మరింత పెరగడంలో ఏథర్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషించనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















