టాటా నుంచి మారుతి వరకు: మార్కెట్‌ను ఏలుతున్న ఐసిన్ TF-60SN ఆటోమేటిక్ గేర్‌బాక్స్
Aisin TF-60SN 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రస్తుతం ఇండియాలో 7 బ్రాండ్లకు చెందిన 19 కార్లలో వాడుతున్నారు. ఇది ఎందుకు అంత పాపులర్ అయిందో తెలుసుకోండి.

Aisin TF-60SN gearbox: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కొన్ని టెక్నాలజీలు నిశ్శబ్దంగా చరిత్ర సృష్టిస్తాయి. అలాంటిదే ఐసిన్ TF-60SN 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్. సాధారణంగా కార్ బ్రాండ్‌ల పేర్లు మాత్రమే మనకు గుర్తుంటాయి. కానీ ఆ కార్లలో పని చేసే కీలక భాగాలను తయారు చేసే కంపెనీల గురించి చాలామందికి తెలియదు. జపాన్‌కు చెందిన ఆటో పార్ట్స్ దిగ్గజం ఐసిన్ అలాంటి కంపెనీల్లో ఒకటి.
ఐసిన్ అంటే ఎవరు?
ఐసిన్ పేరు ఇండియాలో పెద్దగా వినిపించకపోయినా, మన రోడ్లపై పరుగులు తీస్తున్న అనేక కార్లలో ఈ కంపెనీ టెక్నాలజీ ఉంది. ప్రస్తుతం హరియాణాలో ఐసిన్‌కు ఉత్పత్తి కేంద్రం ఉంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో మరో ప్లాంట్ ఏర్పాటు చేసి భారత్‌లో తయారీని మరింత విస్తరించాలనుకుంటోంది.
Maruti e Vitara కోసం లోకల్‌గా తయారవుతున్న eAxle నుంచి మొదలుకుని, అనేక కార్లలో ఉపయోగిస్తున్న ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల వరకు – ఐసిన్ పాత్ర చాలా కీలకం.
‘నేషనల్ గేర్‌బాక్స్’గా ఐసిన్ TF-60SN
ఐసిన్ తయారు చేసిన TF-60SN 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రస్తుతం ఇండియాలో 7 కార్ తయారీదారులకు చెందిన 19 కార్లలో వాడుతున్నారు. వోక్స్‌వ్యాగన్ గ్రూప్ దీన్ని AQ250 అనే పేరుతో పిలుస్తుంది. ఒకప్పుడు ఫియట్ 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్‌ను “ఇండియా నేషనల్ ఇంజిన్” అనేవారు. అదే తరహాలో ఇప్పుడు ఈ ఐసిన్ గేర్‌బాక్స్‌ను కూడా ‘ఇండియా నేషనల్ గేర్‌బాక్స్’ అని పిలవొచ్చు.
ఏ కార్లలో ఈ గేర్‌బాక్స్ ఉంది?
మారుతి, టయోటా, స్కోడా-వోక్స్‌వ్యాగన్, సిట్రోయెన్, మహీంద్రా, టాటా వంటి బ్రాండ్ల కార్లు ఈ గేర్‌బాక్స్‌ను వాడుతున్నాయి. 2015లో మహీంద్రా XUV500 ఆటోమేటిక్ వేరియంట్‌తో మొదటిసారి ఈ ట్రాన్స్‌మిషన్ ఇండియాలోకి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత, ఇది మాస్ మార్కెట్‌లో అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆటోమేటిక్‌గా మారింది.
ఎందుకు అంత పాపులర్ అయింది?
ఈ గేర్‌బాక్స్ విజయానికి ప్రధాన కారణం దీని ఫ్లెక్సిబిలిటీ. నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, మిడియం క్యాపాసిటీ డీజిల్ ఇంజిన్‌లతో ఇది సులభంగా పనిచేస్తుంది. గరిష్టంగా 380 Nm టార్క్ వరకు హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉంది. ప్రధానంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్‌కు పవర్ పంపినా... గ్రాండ్ విటారా, హైరైడర్, విక్టోరిస్, XUV700 లాంటి AWD మోడళ్లలో కూడా ఇది పని చేస్తోంది. ఇది కాంపాక్ట్ సైజ్‌లో, తక్కువ బరువు ఉండటం వల్ల కారు బరువు ఎక్కువ కాకుండా, మైలేజ్ కూడా మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది.
ఏయే మోడళ్లలో దీనిని వాడుతున్నారు?
Maruti Suzuki --- Fronx, Maruti Suzuki Brezza, Maruti Suzuki Ertiga, Maruti Suzuki XL6, Maruti Suzuki Grand Vitara, Maruti Suzuki Victoris
Toyota -- Taisor, Hyryder, Rumion
Skoda -- Kylaq, Kushaq, Slavia
Volkswagen -- Taigun, Virtus
Citroen -- C3, Basalt, Aircross
Tata -- Sierra petrol, Sierra diesel
Mahindra -- XUV 3XO petrol
ఇక ముందు ఏం జరగబోతోంది?
ప్రస్తుతం TF-60SN పీక్ స్టేజ్‌లో ఉంది. ఇకపై, దీని స్థానంలో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ రాబోతోంది. దీనిని Aisin TG-80LS లేదా AWF8G30 అని పిలుస్తారు. వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో ఇది AQ300 పేరుతో వస్తుంది. 2026–27లో స్కోడా కుషాక్, స్లావియా, వోక్స్‌వ్యాగన్ టైగూన్, విర్టస్ ఫేస్‌లిఫ్ట్‌లలో మొదటగా ఇది కనిపించనుంది. ఇది కేఫ్ 3 (CAFE III) ఎమిషన్ నిబంధనలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.
లోకలైజేషన్ ప్లాన్
ముఖ్యంగా, ఈ కొత్త 8-స్పీడ్ గేర్‌బాక్స్‌ను భారతదేశంలోనే తయారు చేయాలనే యోచనలో స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా ఉంది. ఇతర బ్రాండ్లను కూడా దీనిని ఉపయోగించమని ఆహ్వానిస్తోంది. అలా అయితే ఖర్చులు తగ్గి, ఆటోమేటిక్ కార్లు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే, పేరు పెద్దగా వినిపించకపోయినా, ఐసిన్ TF-60SN గేర్‌బాక్స్ భారత కార్ మార్కెట్‌ను ఏలుతోంది. అందుకే దీనిని ‘ఇండియా నేషనల్ గేర్‌బాక్స్’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















