Tata Car: రూ.30 వేల జీతం ఉన్నా నిర్భయంగా టాటా కార్ కొనొచ్చు - EMI చాలా తక్కువ!
Tata Tiago Finance Plan: తెలుగు రాష్ట్రాల్లో, టాటా టియాగో బేస్ మోడల్ XE ఆన్-రోడ్ ధర దాదాపు రూ.6 లక్షలు. ఈ ధరలో RTO ఛార్జీలు రూ. 72,234 & ఇన్సూరెన్స్ రూ. 32,146 కలిసి ఉన్నాయి.

Buying Tata Tiago on Bank Loan And EMI Details: భారతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న కార్లు టాటా మోటార్స్ బ్రాండ్ కార్లు. సామాన్య ప్రజల్లో వీటిపై ఉన్న నమ్మకాన్ని ఏ ఇతర కంపెనీ కూడా బద్ధలు కొట్టలేకపోతోంది. టాటా మోటార్స్ కార్లు కామన్ మ్యాన్ బడ్జెట్‌లో ఉండడం, ఆధునిక ఫీచర్లు యాడ్ కావడం, మరీ ముఖ్యంగా భద్రత పరంగా ఇతర బ్రాండ్‌ల కంటే ముందు వరుసలో ఉండడం ఈ పాపులారిటీకి కారణం. మీరు టాటా నుంచి చీప్ అండ్ బెస్ట్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
"కార్ కొనాలనే కోరిక ఉంటే సరిపోతుందా, జీతం సరిపోవద్దూ" అంటారా?, మీ జీతం రూ. 30 వేల నుంచి ప్రారంభమైనప్పటికీ మీరు టాటా టియాగోను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Tata Tiago Ex-showroom Price) దాదాపు రూ. 5 లక్షలు (రూ. 4,99,990). అయితే, మీరు ఈ బెస్ట్ సెల్లింగ్ ఫోర్ వీలర్‌ను కొనడానికి మొత్తం డబ్బును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 50,000 డౌన్ పేమెండ్‌తో ఈ బండిని సొంతం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో ధర & EMI
తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో బేస్ వేరియంట్ XE (పెట్రోల్) ఆన్-రోడ్ ప్రైస్ (Tata Tiago On-Road Price) 6.05 లక్షల రూపాయలు. RTO ఛార్జీలు రూ. 72,234, బీమా మొత్తం రూ. 32,146, హైపొథికేషన్ ఛార్జీ రూ. 500, ఫాస్టాగ్ రూ. 500, ఇతర ఛార్జీలు రూ. 1000 కూడా ఈ రేటులో కలిసి ఉన్నాయి. టాటా టియాగో కొనడానికి మీరు రూ. 50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 5.50 లక్షల కారు లోన్ తీసుకోవాలి. మీరు బ్యాంకు నుంచి 9% వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలానికి ఈ రుణం తీసుకుంటే, మీ EMI నెలకు 8,849 రూపాయలు అవుతుంది. అంటే, నెలకు దాదాపు 9,000 కేటాయించగలిగితే టాటా టియాగో మీ ఇంటికొస్తుంది.
మీ నెలవారీ ఆదాయం మెరుగ్గా ఉండి ఇంకా ఎక్కువ మొత్తాన్ని భరించగలిగితే, ఆరు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల కాల పరిమితితోనూ ఈ లోన్ తీసుకోవచ్చు.
ఆరేళ్ల కాలానికి, 9% వడ్డీ రేటుతో రూ.5.50 లక్షల లోన్ తీసుకుంటే - నెలకు రూ. 9,914 EMI చెల్లించాలి.
ఐదేళ్ల టెన్యూర్‌తో, 9% వడ్డీ రేటుతో రూ.5.50 లక్షల లోన్ తీసుకుంటే - నెలకు రూ. 11,417 EMI జమ చేయాలి.
మీ నెలవారీ జీతం రూ. 30,000 - రూ. 40,000 మధ్య ఉంటే 7 సంవత్సరాల EMI ప్లాన్ మీకు ఆర్థిక భారం అనిపించదు. 7 సంవత్సరాల EMI ప్లాన్‌లో మీరు మొత్తం రూ. 1.93 లక్షలు వడ్డీగా చెల్లించాలి. ఈ ప్రకారం కారు మొత్తం ధర దాదాపు రూ.7.43 లక్షలకు చేరుకుంటుంది. టాటా టియాగో ఆన్-రోడ్ ధర & ఫైనాన్స్ ప్లాన్‌లు మీ నగరాన్ని బట్టి, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. పూర్తి స్థాయి సమాచారం కోసం మీ సమీపంలోని టాటా షోరూమ్‌ను సంప్రదించండి.
టాటా టియాగో ఇంజిన్ & మైలేజ్
టాటా టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పవర్‌తో నడుస్తుంది. దీనిలో CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో దీని మైలేజ్ (Tata Tiago Mileage) లీటరుకు 20.09 కిలోమీటర్లు, CNG వెర్షన్‌లో మైలేజ్ కిలోగ్రాముకు 28 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది.





















