Mini Fortuner: మార్కెట్‌ను మడతబెట్టేందుకు వస్తున్న 'మినీ ఫార్చ్యూనర్' - రఫ్ అండ్ టఫ్‌గా వాడేయొచ్చు!
Toyota Land Cruiser FJ: కంపెనీ ఈ SUV గురించి 2023లో ఒక టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది. ల్యాండ్ క్రూయిజర్ లైనప్ LC300, LC250 (ప్రాడో) & 70 Series తోపాటు దీనిని చూపించారు.

Toyota Land Cruiser FJ Price And Features: త్వరలో, తెలుగు రాష్ట్రాల రోడ్లపై టయోటా 'మినీ ఫార్చ్యూనర్'ను చూడవచ్చు. 'ల్యాండ్ క్రూయిజర్ FJ' పేరుతో కొత్త మిడ్-సైజ్ SUVని ఈ కంపెనీ లాంచ్ చేయబోతోంది. ఈ SUV టయోటా ఐకానిక్ ల్యాండ్ క్రూయిజర్ సిరీస్‌లో మోస్ట్ కాంపాక్ట్ & ఎకనామికల్ మోడల్ అవుతుంది. ఈ 'స్మాల్ ఫార్చ్యూనర్'ను 2025 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావించినప్పటికీ, ఆ టైమ్‌లైన్‌ను పొడిగించింది.
'మినీ ఫార్చ్యూనర్'ను మొదటిసారిగా 2023లో ల్యాండ్ క్రూయిజర్ LC300, LC250 (ప్రాడో) & 70 సిరీస్‌తో పాటు టీజర్ ఇమేజ్‌లో చూపించారు. ఆ తరువాత FJ పేరును అనౌన్స్ చేయడంతో మార్కెట్‌లో ఊహాగానాలు పెరిగాయి. SUV విభాగంలో బడా కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ కొత్త మోడల్‌ను టయోటా ఫార్చ్యూనర్ సిరీస్ కింద లాంచ్ చేయబోతున్నారు.
మినీ ఫార్చ్యూనర్ డిజైన్ & ప్లాట్‌ఫామ్స్
టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ డిజైన్‌ను ఇప్పటి వరకు పూర్తి రహస్యంగా ఉంచారు. 2023లో విడుదలైన ఏకైక టీజర్ ఇమేజ్‌ను బట్టి ఈ బండి లుక్ చాలా రఫ్-టఫ్ & బాక్సీగా ఉంటుందని చెప్పవచ్చు. ఆకర్షణీయమైన అడ్వాన్స్‌డ్ LED లైటింగ్ సిస్టమ్‌ను ఎక్స్‌టీరియర్‌కు ఫిక్స్ చేశారు, ఈ లైటింగ్ 'మినీ ఫార్చ్యూనర్'కు మోడర్న్ & ప్రీమియం లుక్స్‌ను ఇస్తుంది. అంతేకాదు, హైయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ & చంకీ టైర్లు దీనిని ఆఫ్-రోడింగ్‌కు రెడీగా ఉంచుతాయి. టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ బండి క్లాసిక్ లుక్‌కు మరింత బలం చేకూరుస్తుంది.
మినీ ఫార్చ్యూనర్ ఇంజిన్ & పవర్‌ట్రెయిన్
టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJకు 2.7-లీటర్ 2TR-FE నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పవర్‌ను అందిస్తుంది, ఇది గరిష్టంగా 161 bhp పవర్‌ను & 246 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను యాడ్ చేశారు. బండి ఫోర్ వీల్స్‌కు పవర్‌ను పంపిణీ చేయడానికి 4WD వ్యవస్థను గేర్ బాక్స్ ఉపయోగించుకుంటుంది. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో, ఈ మోడల్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కూడా ఈ కంపెనీ అందించవచ్చు.
భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
భారతదేశంలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ లాంచ్ డేట్‌ను టయోటా ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. మన దేశంలో SUV విభాగానికి విపరీతమైన డిమాండ్ ఉంది కాబట్టి, ఈ SUVని భారతదేశానికి తీసుకురావడంలో ఎక్కువ ఆలస్యం జరగకపోవచ్చు. టయోటా ఫార్చ్యూనర్‌కు ఇండియాలో మామూలు డిమాండ్ లేదు. కాబట్టి, మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లక్ష్యంగా ల్యాండ్ క్రూయిజర్ FJను లాంచ్ చేయవచ్చు. భారతదేశంలో లాంచ్ అయితే.. మహీంద్రా స్కార్పియో-N, టాటా హారియర్ & MG హెక్టర్ వంటి SUVలకు ఇది పోటీ ఇస్తుంది.





















