మిడ్ సైజ్ SUVలలో హోరాహోరీ పోటీ - క్రెటాతో పోలిస్తే కొత్త కుషాక్ ఏ స్థాయిలో ఉంది?
2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. సెగ్మెంట్ లీడర్ హ్యుందాయ్ క్రెటాతో డైమెన్షన్లు, ఇంజిన్ స్పెసిఫికేషన్లను పోలిస్తే ఏ కారు పైచేయి సాధిస్తుంది?.

2026 Skoda Kushaq Price And Features: భారత మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా ఇప్పటివరకు ఎలాంటి పోటీ లేకుండా అమ్మకాలలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని స్కోడా భావిస్తోంది. అందులో భాగంగానే 2026 స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో, కొత్త కుషాక్ క్రెటాకు ఎంతవరకు పోటీ ఇవ్వగలదో గణాంకాల్లో అర్దం చేసుకుందాం.
డైమెన్షన్లు: సైజ్‌లో ఏది పెద్ద కారు?
కుషాక్ కంటే హ్యుందాయ్ క్రెటానే పెద్దగా ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు పరంగా క్రెటా పైచేయి సాధిస్తుంది. అయితే, స్కోడా కుషాక్‌కు 41 మిల్లీమీటర్లు ఎక్కువ వీల్‌బేస్ ఉంది. దీని వల్ల క్యాబిన్‌లో ప్రయాణికులకు కాళ్లకు మరింత స్థలం లభించే అవకాశం ఉంది.
అలాగే, బూట్ స్పేస్ విషయానికి వస్తే, కుషాక్‌కు 55 లీటర్లు అదనపు స్టోరేజ్ లభిస్తుంది. కుటుంబ ప్రయాణాలకు, లగేజ్ ఎక్కువగా తీసుకెళ్లే వారికి ఇది ఉపయోగకరంగా మారుతుంది. రెండు SUVల టాప్ వేరియంట్లలోనూ 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్ స్పెసిఫికేషన్లు: దేని పవర్ ఎక్కువ?
స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా రెండూ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తాయి. కానీ, ఇక్కడ పెద్ద తేడా ఏమిటంటే - కుషాక్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉండగా, క్రెటాలో ఒక న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, ఒక టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉన్నాయి.
కుషాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ క్రెటా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో పోలిస్తే 34Nm ఎక్కువ టార్క్ ఇస్తుంది. అంతేకాదు, ఈ ఇంజిన్‌కు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను స్కోడా అందిస్తోంది. క్రెటాలో మాత్రం CVT గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.
ఈ రెండింటిలోనూ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఈ ఇంజిన్ విషయంలో క్రెటా ముందంజలో ఉంది. హ్యుందాయ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 10hp పవర్, 3Nm టార్క్ ఎక్కువగా ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌ను కూడా హ్యుందాయ్ అందిస్తోంది. కుషాక్‌లో మాత్రం ఆటోమేటిక్ మాత్రమే ఉంది.
డీజిల్ ఇంజిన్: క్రెటాకు అదనపు ప్లస్
| | ప్రస్తుతం ఉన్న కుషాక్ | హ్యుందాయ్ క్రెటా |
| ఇంజిన్ రకం | 3-cyls turbo, 4-cyls turbo | 4-cyls NA, 4-cyls turbo |
| డిస్‌ప్లేస్‌మెంట్ (cc) | 999, 1498 | 1497, 1482 |
| పవర్ (hp) | 115, 150 | 115, 160 |
| టార్క్ (Nm) | 178, 250 | 144, 253 |
| MT గేర్‌బాక్స్ | 6-speed, - | 6-speed, 6-speed |
| AT గేర్‌బాక్స్ | 8-speed AT, 7-speed DCT | CVT, 7-speed DCT |
ఇక్కడే క్రెటాకు పెద్ద అడ్వాంటేజ్ లభిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కుషాక్‌లో లేదు. క్రెటాలో ఉన్న ఈ డీజిల్ ఇంజిన్ 116hp పవర్, 250Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లతో వస్తుంది. ఆసక్తికరంగా, క్రెటా మొత్తం అమ్మకాలలో దాదాపు 44 శాతం డీజిల్ వేరియంట్ల నుంచే వస్తున్నాయి.
ఏ కారుకు ఛాన్స్ ఎక్కువ?
స్పెసిఫికేషన్లను చూస్తే, 2026 స్కోడా కుషాక్ క్రెటాకు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అసలు విజేత ఎవరో మాత్రం కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలు వెల్లడైన తర్వాతే తేలనుంది. ప్రస్తుతం క్రెటా ధరలు పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను బట్టి రూ.10.79 లక్షల నుంచి రూ.20.20 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వరకు ఉన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















