2025 Hyundai Venue రెడీ టు లాంచ్ - ADAS, రెండు 12.3 ఇంచ్ స్క్రీన్స్, మరెన్నో హైటెక్ ఫీచర్స్!
Hyundai Venue కొత్త జనరేషన్ SUV నవంబరు 4న భారత మార్కెట్లోకి వస్తోంది. ADAS సేఫ్టీ, డ్యూయల్ 12.3 ఇంచ్ స్క్రీన్‌లు, ఫ్రెష్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో కాంపాక్ట్ SUV మార్కెట్లో హంగామా చేయబోతోంది.

New Gen Hyundai Venue Launch Date Features: దీర్ఘకాలం తర్వాత, హ్యుందాయ్ ఇండియా, తన కాంపాక్ట్ SUV కి ఒక మేజర్ అప్‌డేట్‌తో వస్తోంది. 2019లో లాంచ్ అయినప్పటి నుంచి పెద్ద మార్పులు రాని Hyundai Venue, ఇప్పుడు రెండో జనరేషన్ రూపంలో నవంబరు 4, 2025న భారతీయ మార్కెట్లో గ్రాండ్ లాంచ్ జరుపుకోబోతోంది. కొత్త వెన్యూ రూపం, హై టెక్నాలజీ & అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో ఈ సెగ్మెంట్‌లోని పోటీదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.
2025 వెన్యూ డిజైనింగ్
కొత్త తరం వెన్యూ, మొదట, దక్షిణ కొరియాలో టెస్ట్ మ్యూల్‌గా కనిపించింది. అప్పటి నుంచే ఈ కారు డిజైన్ గురించి గ్లోబల్ మార్కెట్లలో గట్టి ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్‌లో.. ఫ్రంట్ గ్రిల్ పెద్దగా & వెడల్పుగా ఉండి, హ్యుందాయ్‌కు సొంతమైన పారామెట్రిక్ ప్యాటర్న్‌ను చూపించింది. స్లీక్ C ఆకారంలోని LED DRLs టాప్ సెక్షన్‌లో ఉండగా, మెయిన్ హెడ్‌ల్యాంప్‌లు కింద భాగంలో హౌసింగ్‌లో ఉన్నాయి. ఈ డిజైనింగ్.. బంపర్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపిస్తుంది.
2025 వెన్యూ సైడ్ ప్రొఫైల్‌లో చూసినప్పుడు ఈ కారు కాంపాక్ట్‌గా అనిపించినప్పటికీ, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, షార్ప్ లైన్స్ కారు లుక్‌ను ఫ్రెష్‌గా మార్చేశాయి. ఇంటీరియర్‌లోకి వెళ్లినప్పుడు, మొదటి చూపులోనే ఒక పెద్ద విజువల్ అప్‌గ్రేడ్ కనిపిస్తుంది. రెండు 12.3 ఇంచ్ స్క్రీన్‌లు ఒకే గ్లాస్ ప్యానెల్ కింద ఇచ్చారు. వాటిలో ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలా ఉంటాయి. ఇవి రెండూ ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌డేట్స్‌కు సపోర్ట్ చేస్తాయి. అంటే, కొత్త ఫీచర్లను సాఫ్ట్‌వేర్ ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. క్యాబిన్ డిజైన్ ఇప్పుడు మరింత వైడ్ & సింపుల్‌గా కనిపిస్తుంది. హారిజాంటల్ AC వెంట్స్, రీడిజైన్డ్ స్టీరింగ్ వీల్, ఆంబియెంట్ లైటింగ్, కొత్త సీటు ఫాబ్రిక్స్ మొత్తం కొత్త హ్యుందాయ్ వెన్యూకి ప్రీమియం టచ్ ఇస్తాయి.
అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
సేఫ్టీ పరంగా ఈసారి హ్యుందాయ్ పెద్ద అడుగు వేసింది. కొత్త వెన్యూ ఇప్పుడు లెవల్ 2 ADAS ఫీచర్లతో వస్తుంది, ఇందులో - అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొల్లిజన్ అవాయిడెన్స్, ఆటో బ్రేకింగ్ వంటి ఆధునిక ఫంక్షన్లు ఉన్నాయి. ఇవి సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవే లాంగ్ డ్రైవ్‌లలోనూ డ్రైవర్‌కు, ప్రయాణీకులకు పూర్తి కంఫర్ట్ & సేఫ్టీని అందిస్తాయి.
ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు లేవు - 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లు అలాగే కొనసాగుతాయి. గేర్‌బాక్స్ ఆప్షన్లలో... 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ & 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉంటాయి.
పోటీ కార్లు
కొత్త వెన్యూ ఇప్పుడు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సొనెట్, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మహీంద్రా XUV 3XO వంటి ప్రధాన ప్రత్యర్థులకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోంది. ప్రీమియం లుక్, లోడెడ్ ఫీచర్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్‌తో... కాంపాక్ట్ SUV రేసులో కొత్త వెన్యూ తిరిగి కింగ్ అవ్వాలని హ్యుందాయ్ లక్ష్యం పెట్టుకుంది.
నవంబరు 4న లాంచ్ తర్వాత, ఇది యువతరానికే కాకుండా ఫ్యామిలీ బయ్యర్స్‌కూ ఓ మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ అంటే ప్రస్తుత మోడల్‌కు కేవలం అప్‌డేట్ మాత్రమే కాదు, కాంపాక్ట్ SUVలలో కొత్త ట్రెండ్ సెట్టర్ కానుంది!.





















