2022 Maruti Suzuki Ertiga: కొత్త ఎర్టిగా వచ్చేసిందిగా - ధర రూ.8.5 లక్షలలోపే - స్టైలిష్ లుక్, సూపర్ ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?
మారుతి సుజుకి మనదేశంలో కొత్త ఎర్టిగా మోడల్‌ను లాంచ్ చేసింది. ఇందులో చాలా వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
2022 మారుతి సుజుకి ఎర్టిగా మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఎంపీవీ ధర రూ.8.35 లక్షల (ఎక్స్-షోరూం, ఢిల్లీ) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఎన్నో వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొత్త ఇంజిన్, పూర్తిగా కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్స్ అందించారు. మారుతి సుజుకి కారు ఈ తరహా గేర్ బాక్స్‌తో లాంచ్ కావడం దేశంలో ఇదే తొలిసారి.
ప్యాడిల్ షిఫ్టర్ ఫీచర్ కూడా ఈ కారులో అందించారు. దీని ద్వారా గేర్లను సులభంగా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి మారుతి సుజుకి కారు ఇదే. అయితే ఇంతకు ముందు వెర్షన్‌ను రూపొందించిన హార్టెక్ట్ ప్లాట్‌ఫాంపైనే ఈ కారు కూడా రూపొందించారు. ఇక డిజైన్‌లో కూడా మారుతి సుజుకి పెద్దగా మార్పులేమీ చేయలేదు.
మారుతి సుజుకి కొత్త ఎర్టిగా బుకింగ్స్ కూడా మనదేశంలో కొద్దిరోజుల క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ కారు డెలివరీలు కూడా త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ కారును మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ప్రోగ్రాం ద్వారా కారును ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన పెట్రోల్ వేరియంట్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చార్జెస్ రూ.18,600గానూ, సీఎన్‌జీ వేరియంట్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చార్జెస్ రూ.22,400గానూ ఉండనుంది.
ఈ కారు డిజైన్ పూర్తిగా దీని ముందు వెర్షన్ తరహాలోనే ఉంది. అయితే కారు ముందుభాగంలో మాత్రం కొత్త తరహా క్రోమ్ వింగ్డ్ గ్రిల్‌ను అందించారు. అలాగే డ్యూయల్ టోన్ అలోయ్ వీల్స్ కూడా ఉన్నాయి. స్ప్లెండిడ్ సిల్వర్, డిగ్నిటీ బ్రౌన్ అనే కొత్త కలర్ ఆప్షన్లలో ఈ ఎర్టిగాను కొనుగోలు చేయవచ్చు.
క్యాబిన్ లోపల కూడా తక్కువ మార్పులు చేశారు. మెటాలిక్ టేక్ వుడెన్ ఫినిష్‌తో డిజైన్ చేసిన డ్యాష్ బోర్డు చూడటానికి చాలా కొత్తగా ఉంది. డ్యూయల్ టోన్ సీట్ ఫ్యాబ్రిక్ ఆకర్షణీయంగా ఉంది. ఏడు ఇంచుల స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్న సుజుకి కనెక్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ‘హాయ్ సుజుకి’ అనే కమాండ్ ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ట్రిగ్గర్ చేయవచ్చు. అమెజాన్ అలెక్సా కంపాటిబులిటీ, ఆటోమేటిక్ ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనక వరుసల్లోని సీట్లకు రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్, క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఈ కారులో కంపెనీ అందించింది.
ఇక సేఫ్టీ విషయానికి వస్తే... ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రివర్సింగ్ సెన్సార్లు, స్పీడ్ అలెర్ట్ సిస్టం ఫీచర్లను స్టాండర్డ్ వేరియంట్లో అందించగా... నాలుగు ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్న ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం ఫీచర్లు హై ఎండ్ వేరియంట్లలో ఉన్నాయి.
ఈ కొత్త తరం ఎర్టిగాలో 1.5 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌ను అందించారు. మెరుగైన సామర్థ్యం ప్రొగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. 102 బీహెచ్‌పీ, 137 ఎన్ఎం పీక్ టార్క్‌ను కొత్త ఎర్టిగా అందించనుంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, కొత్త సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ప్యాడిల్ షిఫ్టర్లతో ఈ ఇంజిన్ రావడం విశేషం.
కొత్త మారుతి సుజుకి ఎర్టిగా మాన్యువల ట్రాన్స్‌మిషన్ మోడల్ 20.51 కిలోమీటర్ల మైలేజ్‌ను, ఆటోమేటిక్ గేర్ బాక్స్ మోడల్ 20.3 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనున్నాయి. ఇక సీఎన్‌జీ మోడల్‌లో మాన్యువలే గేర్ బాక్స్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. కేజీ సీఎన్‌జీ ఇంధనానికి 26.11 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇది అందించనుంది.
2022 మారుతి సుజుకి ఎర్టిగా ధర
⦿ ఎర్టిగా కొత్త మోడల్ ప్రారంభ వేరియంట్ అయిన ఎల్ఎక్స్ఐను రూ.8.35 లక్షలకు దక్కించుకోవచ్చు.
⦿ వీఎక్స్ఐ వేరియంట్‌లో మాన్యువల్ మోడల్ ధరను రూ.9.49 లక్షలుగానూ, ఆటోమేటిక్ మోడల్ ధరను రూ.10.99 లక్షలుగానూ నిర్ణయించారు.
⦿ జెడ్ఎక్స్ఐ వేరియంట్‌లో మాన్యువల్ మోడల్ ధర రూ.10.59 లక్షలుగానూ, ఆటోమేటిక్ మోడల్ ధర రూ.12.09 లక్షలుగానూ ఉంది.
⦿ ఇక జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ మాన్యువల్ మోడల్‌ను రూ.11.29 లక్షలకు, ఆటోమేటిక్ మోడల్‌ను రూ.12.79 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
⦿ సీఎన్‌జీ వీఎక్స్ఐ ధర రూ.10.44 లక్షలు కాగా, జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.11.54 లక్షలుగా ఉంది. (ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.)
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?