Tungnath Temple History: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది
మహా శివరాత్రి ప్రత్యేక కథనం: పంచ కేదారాల్లో రెండో పుణ్యక్షేత్రం తుంగనాథ్. శివుడి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగానాథ్ అని అంటారు. శివుడి చేతుల అడుగు ఎత్తులో లింగరూపంలో వెలసిన క్షేత్రం ఇది.
![Tungnath Temple History: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది Tungnath Temple: All about Uttarakhand's Tungnath Temple, The Highest Shiva Temple in the world, Maha Shivratri 2023 Special story Tungnath Temple History: ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం - పరమేశ్వరుడి బాహువులు పడిన ప్రదేశం ఇది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/04/f11a1dcde48dd796d72837327fe145d81675533450696217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tungnath Temple: ప్రకృతి ఒడిలో పరమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తుంది హిమాలయ ప్రాంతం. అత్యంత సాహసోపేతమైన యాత్ర ఇది. అందుకనే సంసార బంధాల నుంచి విముక్తి చెందాలనుకునే వారికి హిమాలయాల్లో కొలువుతీరిన శంకరుడిని దర్శించుకోవాలనే కోరిక కలుగుతుంది. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్. హిమాలయాల్లోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా మంచుపర్వతాలే కనిపిస్తాయి. ఈ ప్రశాంత వాతావరణం చూసి చంద్రుడు పరవశించిపోయాడట. ఆ పరవశంలోనే సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడు. అందుకే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు.
Also Read: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!
పంచ కేదార క్షేత్రాల్లో ఒకటి తుంగనాథ్
పంచ కేదారార క్షేత్రాల్లో ఒకటి తుంగనాథ్. ఈ పంచ కేదార క్షేత్రాలు ఏర్పడడం వెనుక ఓ గాథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బంధువులను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానకి శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే భోళాశంకరుడు మాత్రం పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించడు. కాశీని వదిలి ఉత్తరదిశగా హిమాలయాలకు వెళ్లిపోతాడు. పట్టువదలని పాండవులు..శివుడి దర్శనార్థం వెళతారు. అలా తిరుగుతూ తిరుగుతూ నందిరూపంలో ఉన్నాడని గుర్తిస్తారు. అప్పుడు ఆ నందిని పట్టుకునేందుక భీముడు ప్రయత్నించగా..శివుడు వేరు వేరు శరీరభాగాలతో ఐదు ప్రదేశాల్లో దర్శనమిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి. వీటినే శివ పురాణంలో పంచ కేదారాలుగా చెప్పారు.
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం
శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్ క్షేత్రం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుడిని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు. పేరుకి తగినట్లుగానే ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఓ వైపు మందాకినీ నది, మరో వైపు అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి.
Also Read: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!
తుంగనాథ్ సందర్శించడానికి ఉత్తమ సమయం
తుంగనాథ్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు. ఈ సమయంలో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తుంగనాథ్ మాత్రమే కాదు ఆ చుట్టపక్కలున్న స్థలాల సందర్శనకు ఇదే అనువైన సమయం.
శివషడక్షర స్తోత్రమ్ (Shiva Shadakshara Stotram)
ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||
నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః |
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||
మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||
శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||
వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||
యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)