Nara Lokesh: కొంతమంది పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు, జగన్‌పై తిరుగుబాటు చేయాల్సిందే - నారా లోకేష్
Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా చేస్తోందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన నర్సాపురం మండలంలో పాదయాత్ర చేశారు.
Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా చేస్తోందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన నర్సాపురం మండలంలో పాదయాత్ర చేశారు. అనంతరం సరిపల్లిలో అగ్నికుల క్షత్రియులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ కష్టాలను ఆయనకు వివరించారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దామాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశాలు ఇవ్వాలని అగ్నికుల క్షత్రియులు కోరారు.
ఫిష్ ఆంధ్రాని, ఫినీష్ ఆంధ్రా చేశారు - లోకేశ్
పార్లమెంటు నియోజకవర్గంలో తమ పిల్లలకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాల విజ్ఞప్తి చేశారు. తమ జీవన ప్రమాణాలు పెరుగుదలకు మినీ హార్బర్ కట్టాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వేటకు వెళ్లి ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ రావడం లేదని వాపోయారు. అని అగ్నికుల క్షత్రియులు లోకేష్‌కు వివరించారు.ఈ సందర్భంగా లోకేష్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ మత్స్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేదన్నారు. జగన్ సీఎం అయ్యాక ఏపీని ఫినిష్ ఏపీగా మార్చేశారని విమర్శించారు. తాను పాదయాత్ర చేసిన 207 రోజులు జగన్ పెట్టిన ఫిష్ ఆంధ్రా పాయింట్లు మూతబడే ఉన్నాయన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘చెరువులను పెత్తందారులకు అప్పజెప్పేందుకు జీఓ 217ను తెచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ జీఓ 217ను రద్దు చేసి మత్స్యకారులకే చెరువులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధికారంలో ఉండగా 75శాతం సబ్సిడీతో బోట్లు, వలలు ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు జగన్ రద్దు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాం. అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌కు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం’ అని అన్నారు.
‘జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యా పథకం రద్దు చేశారు. కానీ తన పిల్లలు ఇద్దర్నీ విదేశాల్లో చదివిస్తున్నారు. పేదోళ్ల బిడ్డలు విదేశాల్లో చదవకూడదన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. 2014-19 మధ్యలో ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. 2019లో ఓ వ్యక్తి విశాఖలో గెలిచి పార్టీ నుంచి ఫిరాయించాడు. నాయకులను తయారుచేసే పార్టీ టీడీపీ. మేం అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు ఇస్తాం. మత్స్యకారులను ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాం’ అని అన్నారు.
‘మేం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 2026 కల్లా ఫిషింగ్ హార్బర్‌ను కట్టే బాధ్యతను తీసుకుంటాం. ఆలయ ట్రస్టు బోర్డుల్లో జరుగుతున్న అవకతవకలను సరిచేస్తాం. వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా చేస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక బటన్ సంక్షేమం కాకుండా సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తాం. మేం అధికారంలోకి వచ్చాక సైకో జగన్ నిలిపేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. వైసీపీ నాయకులు మాపై అక్రమ కేసులు పెట్టి మా వలంటీర్లను జైళ్లకు పంపి రాక్షసానందం పొందుతున్నారు’ అంటూ లోకేష్ మండిపడ్డారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామంటూ నాకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కొంతమంది పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. జగన్మోహన్ రెడ్డి అగ్నికుల క్షత్రియులకు చేసిన అన్యాయంపై తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.