YSRCP : వైఎస్ఆర్‌సీపీకి పన్నెండేళ్లు - సంకల్పం నెరవేరుతోందన్న సీఎం జగన్ !
వైఎస్ఆర్‌సీపీ 12వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. సంకల్పం నెరవేరుతోందని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ( YSRCP ) పన్నెండో వార్షికోత్సవం జరుపుకుంటోంది. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో.. అనేక మంది గుండె పగిలి చనిపోయారని..వారందరికీ ఓదార్పు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ 2011 మార్చి పన్నెండో తేదీన కొత్త పార్టీని ప్రకటించారు. సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత 2019లో పార్టీని జగన్ అధికారంలోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్‌సీపీ 22 మంది ఎంపీలతో లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంది. ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయని పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ( CM Jagan ) పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2022
కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షల దిశగా అడుగులు వేసిన వైఎస్ఆర్‌సీపీ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ( SAJJALA ) అన్నారు. అధికారం కోసం కొట్లాడే రాజకీయం కాకుండా సేవ చేయడంలో పోటీ చూపిస్తోంది కాబట్టే ఇంత ప్రజాదరణ దక్కుతోందన్నారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రమంతా వైయస్ఆర్ సీపీ ఆవిర్భావ పండుగ
— YSR Congress Party (@YSRCParty) March 12, 2022
- వాడవాడలా రెపరెపలాడుతోన్న వైయస్ఆర్ సీపీ జెండా
- సంక్షేమ సారధి సీఎం వైయస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
- అంబరాన్ని అంటుతున్న వైయస్ఆర్ సీపీ శ్రేణుల సంబరాలుhttps://t.co/LclAU6Irlu #12yearsForYSRCP#YSRCPFormationDay
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైసీపీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. వైఎస్ జయంతి రోజున ప్లీనరీని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అన్ని చోట్లా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొన్నారు.