YSR District: ఆ పేరు అరిష్టం, వైఎస్సార్ జిల్లా పేరు జగన్ మార్చకపోతే మేం మార్చుతాం: తులసిరెడ్డి
Tulasi Reddy On Name Of YSR District: 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడదీస్తే అధికార వికేంద్రీకరణ జరిగినట్టేనా, ముందు వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
YSR Kadapa District: ఏపీలో జిల్లాలను 13 నుంచి 26కు చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిన్నటి నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమైంది. అయితే 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడదీస్తే అధికార వికేంద్రీకరణ జరిగినట్టేనా అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరుగుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా పాత కడప జిల్లా పేరు విషయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వైఎస్సార్ పేరు మాత్రమే ఉండటం అరిష్టమని, వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు చేశారు.
కడప జిల్లా 1808లో ఏర్పాటు అయిందని, అతి ప్రాచీనమైన జిల్లా అని తులసిరెడ్డి తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామీ నిలయమైన తిరుమలకు తొలి గడప కడప. అందువల్లే ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారని పేర్కొన్నారు. కానీ 2009 లో కడప జిల్లాకు చెందిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో.. నేతలు ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరున వైయస్ఆర్ జిల్లాగా మార్చారని గుర్తుచేశారు.
పేరు మార్చాలని గతంలోనే సూచించాం..
తిరుమలకు తొలి గడప కనుక జిల్లా పేరు కడపగానే తిరిగి మార్చాలని, లేదా వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినా ఏ అభ్యంతరం లేదని పలువురు నేతలు గతంలోనే ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తాజాగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసే సమయంలోనూ వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు సీఎం జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయని తులసిరెడ్డి పేర్కొన్నారు.
అది చాలా అరిష్టం..
జిల్లాకు కేవలం వైఎస్సార్ పేరు ఉండటం అరిష్టం. సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి, జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లా అనే పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఒకవేళ వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లా పేరు మార్చకపోతే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా సరే వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేస్తామని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు.
Also Read: New Districts Land Rates : కొత్త జిల్లాల్లో పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు!