New Districts Land Rates : కొత్త జిల్లాల్లో పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు!
New Districts Land Rates : కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 6 నుంచి భూముల విలువ సవరిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.
New Districts Land Rates :ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల్లో భూముుల విలువను ఏప్రిల్ 6 నుంచి సవరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. మార్కెట్ విలువలకు బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.
ఒకే చోట ప్రభుత్వ కార్యాలయాలు
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొత్త జిల్లా కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13 కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరించనున్నట్లు తెలిపింది. కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న కారణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని నిర్ణయించింది. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం కనీసం 15 ఎకరాల స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
ఏపీలో కొత్తగా 13 జిల్లాలు(AP New Districts) ఏర్పాటుతో రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతున్నాయి. కొత్త ఆస్తుల విలువలను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్నిచోట్ల ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. ఈ డిమాండ్ ను ఆదాయంగా మార్చుకునేందుకు ప్రభుత్వం కూడా ఆస్తుల విలువను పెంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 6 నుంచి కొత్త ఆస్తుల విలువలు అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఆస్తుల విలువను బట్టి రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో కొంత మేర ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది.
కొత్తగా 13 జిల్లాలు
ఏపీలో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కొత్త జిల్లాలతో ఏపీలో కొత్త శకానికి నాంది అని అన్నారు. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రాగా ఆంధ్రప్రదేశ్ మారిందని వైఎస్ జగన్ అన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లోని ఉద్యోగులందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. చివరగా 1970 మార్చిలో ప్రకాశం (Prakasam), 1979లో జూన్‌లో విజయనగరం (Vizianagaram) జిల్లా ఏర్పడిందని జగన్ (Jagan) గుర్తు చేశారు. ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ (CM Jagan) కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా వర్చువల్‌గా ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించారు.