Raghurama Vs YSRCP : అమరావతే రాజధానిగా ఉంటుంది.. కొత్త లాజిక్ చెప్పిన రఘురామ..!
అమరావతిని రాజధానిగా తరలించాలంటే ఏపీ ప్రభుత్వం రూ. 90వేల కోట్లు కట్టాల్సి ఉంటుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. రాజధానిని తరలించడం సాధ్యం కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలను ఉల్లంగించి.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొచ్చారని.. అసలు అప్పులిచ్చే కార్పొరేషన్ పేరుతో అప్పులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అప్పులు తీసుకొచ్చి స్విచ్చులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేస్ అభివృద్ధి కార్పొరేషన్ , రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నారని ఇదంతా నిబంధనల ఉల్లంఘననేని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ప్రధానికి ఫిర్యాదు చేశానని తెలిపారు.
అమరావతి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందన్న అభిప్రాయాల మధ్య రఘురామకృష్ణరాజు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎక్కడికీ పోదని.. నూటికి నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటందని స్పష్టం చేశారు. రాజధాని మార్చాలంటే... రూ.80వేల నుంచి రూ.90వేల కోట్లను రైతులకు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. విశాఖ ప్రజలు రాజధాని వద్దు బాబోయ్ అంటున్నారని .. అక్కడ కజ్బాలు పెరిగిపోయాయన్నారు. అదే సమయంలో అమరావతి రైతులు, మహిళలకు ధైర్యం చెప్పారు. నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని వారికి భోసా ఇచ్చారు. అమరావతి పిటిషన్లపై విచారణ వాయిదాను రైతులు కోరారని..దాని వెనుక కుట్ర ఉండి ఉండవచ్చన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై రఘురామ సెటైర్లు వేశారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడ్వకేట్ జనరల్‌తో బొత్స మాట్లాడి ఉండాల్సిందన్నారు. ఆయనే వాయిదా కోరారని గుర్తు చేశారు. కోర్టు అంగీకారంతోనే రాజధానిని విశాఖ తీసుకెళ్తామన్న బొత్స వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోర్టులను ఒప్పించడం .. కోర్టుతో మాట్లాడి విశాఖకు తీసుకెళ్లడం అంటే ఏమిటని ప్రశ్నించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్ల పరిస్థితిపై నాడు - నేడు పేరుతో రఘురామ సైటైర్లు వేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన వీడిోయను ప్రదర్శించారు. నాడు రోడ్లు బాగోలేవు, నేడు అసలు రోడ్లు లేవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలకు వెళ్తే ఆయనకే విషయం అర్థమవుతుందన్నారు. ఇటీవల ఓ పెళ్లికి భీమవం వెళ్లారని కానీ రోడ్డుపై వెళ్తే బాధలు తెలిసేవని వ్యాఖ్యానించారు. తాను దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లపై బుధవారం తీర్పు రానున్న అంశంపైనా రఘురామ స్పందించారు. తమ ముఖ్యమంత్రి ..తమ పార్టీ అధినేత కడిగిన ముత్యంలా బయటకు రావాలనే బెయిల్ రద్దు పిటిషన్ వేశానన్నారు. తన కోరిక నిజమవుతుందా లేదా అన్నది బుధవారం తేలుతుందన్నారు. పార్టీని బతికించుకోవాలని.. ముఖ్యమంత్రికి చెడ్డ పేరు ఉండకూడదనేదే తన కోరికని రఘురామ చెప్పుకొచ్చారు.