Sharmila Exclusive: కరేడు రైతులకు మద్దతుగా YS షర్మిల, జులై 10న పర్యటించాలని నిర్ణయం
YS Sharmila Karedu Visit | కరేడు రైతుల ఉద్యమానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. జులై 10న కరెడులో పర్యటించి రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని కరేడు రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. మొదట్లో BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక్కరే ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల కూడా కరేడు రైతులకు అండగా నిలుస్తున్నారు. తమ గ్రామ పరిసరాల్లోని సుభిక్షమైన 8300 ఎకరాలు భూమిని ప్రవేటు కంపెనీ పరం చేయడానికి మీరు ఎవరు అంటూ ప్రభుత్వ నిర్ణయం పై కరేడు రైతులు ధ్వజం ఎత్తారు. ప్రస్తుతం వారి పోరాటానికి సోషల్ మీడియా నుండి భారీ మద్దతు లభిస్తుండడం తో అందరి దృష్టి అటువైపు మరలింది. దానితో కరేడు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద టాపిక్ గా మారుతోంది.
సోలార్ కంపెనీ కి 8వేల ఎకరాలు భూమి
గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇండిసోల్ అనే సోలార్ ఎనర్జీ కంపెనీ కి రామాయ పట్నం పోర్టు సమీపంలో భూమి కేటాయించారు. అప్పట్లో అది జగన్ సన్నిహితుల కంపెనీ అంటూ టీడీపీ ఆరోపించింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారం లోకి వచ్చాక ఆ భూమిని బీపీసీల్ పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్ కోసం కేటాయించి ఇండిసోల్ కంపెనీ కి కరేడు వద్ద 8000 ఎకరాలు పైగా భూమిని కేటాయించారు. అదంతా ఏడాదికి మూడు పంటలు పండే భూమి. 20 రకాల పంటలు పండుతాయి.

ముందుగా 4వేల ఎకరాల పైగా భూ సమీకరణ కు నోటిఫికేషన్ ఇవ్వడం తో కడేరు రైతులు రోడ్డెక్కారు. దానితో పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. అయితే అటు అధికార పార్టీ గానీ ఇటు విపక్ష వైసీపీ కానీ దీనిపై మాట్లాడలేదు. ఒకరిద్దరు మినహా ప్రధాన మీడియా సైతం మొదట్లో దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు సోషల్ and డిజిటల్ మీడియా ఈ ఇష్యూ ని హైలెట్ చేయడం తో ఒకొక్కరిగా కరేడు అంశం పై కదిలి వస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ నాయకురాలిగా YS షర్మిల 10వ తేదీన కరేడు పర్యటన జరిపి రైతులకు మద్దతు పలుకనున్నారు.
షర్మిల పర్యటన ప్రాధాన్యం ఇదే
మొన్న BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కరేడు రైతులకు మద్దతు పలికినందుకు ఏకంగా పుంగనూరు వెళ్లి మరీ ఆయనకు సన్మానం చేసారు కరేడు రైతులు. ఇప్పుడు షర్మిల పర్యటన వారి పోరాటానికి మరింత బూస్ట్ ఇవ్వనుంది. ఏపీ లో ప్రస్తుతం పెద్ద గా ప్రభావం చూపే స్థాయిలో కాంగ్రెస్ లేకపోయినా అది ఒక జాతీయ పార్టీ అని మరువకూడదు. షర్మిల పర్యటన తో కరేడు రైతుల పోరాటం జాతీయ పార్టీల స్థాయిలో ప్రాధాన్యత పొందే అవకాశం ఉందని కరేడు రైతులు, ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.





















