Aan Paavam Pollathathu OTT : సొసైటీలో మగాడి బాధకు విలువేదీ? - భార్యా బాధితులకు పర్ఫెక్ట్ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
Aan Paavam Pollathathu OTT Platform : వివాహ బంధాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగే డివోర్స్ వ్యవహారం బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన తమిళ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

Rio Raj's Aan Paavam Pollathathu OTT Streaming In Telugu : కోర్టులో డివోర్స్ కేస్ నడుస్తుంటుంది. భర్త తరఫు లాయర్ వాదిస్తుంటాడు. ఆయన అడిగే ప్రతీ ప్రశ్న ప్రజెంట్ సొసైటీలో భర్త నుంచి విడిపోవాలని అనుకునే అమ్మాయిలకే. చిన్న చిన్న విషయాలకే కనీసం ఆలోచన లేకుండా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే దంపతులకే. గత రెండు రోజులుగా ఈ మూవీకి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమ్మాయిలతో పెళ్లి తర్వాత ఎంతో గొప్ప జీవితం ఊహించుకున్న అబ్బాయిలకు కొందరు అమ్మాయిల ప్రవర్తన వల్ల చివరకు నిరాశే మిగులుతుందని... పెళ్లి అంటే 50 50 కాదని... ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటూ గొప్ప సందేశం ఇచ్చారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు... 'మగాడి మనోగతం ఈ సినిమా అని', చాలా రోజుల తర్వాత మన కోసం కూడా ఓ వీడియో వచ్చిందిరోయ్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
'ఆన్ పావమ్ పొల్లతత్తు'... తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రస్తుతం సొసైటీలో పెళ్లి, వివాహం బంధం వంటి అంశాలే బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన తమిళ మూవీ 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. రీసెంట్‌గా నవంబర్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలోని కోర్టు సీన్స్ క్లిప్స్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్త తరఫున వాదిస్తోన్న లాయర్ అడిగిన ప్రశ్నలు ప్రెజెంట్ ట్రెండ్ అమ్మాయిలకు సరిగ్గా సరిపోతాయంటూ అభిప్రాయపడుతున్నారు.
ఈ మూవీలో రియో రాజ్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటే విఘ్నేష్ కాంత్, షీలా రాజ్ కుమార్, జెన్సన్ దివాకర్ కీలక పాత్రలు పోషించారు. కలైయరసన్ తంగవేల్ దర్శకత్వం వహించగా... డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు. సిద్ధు కుమార్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
Also Read : భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు శివ (రియో రాజ్). మంచి ఉద్యోగం, తల్లి, తండ్రి, తమ్ముడు ఇదే అతని జీవితం. పెళ్లి, తనకు కాబోయే భార్య గురించి గొప్ప జీవితం ఊహించుకుంటాడు. ఇక శక్తి (మాళవిక మనోజ్) కనీసం ఇంటర్ పాస్ కావడానికి కూడా నానా తంటాలు పడుతుంది. తండ్రి డిసిప్లీన్‌తో తన భర్తతో ఫ్రీగా ఉండాలని భావిస్తుంది. శివతో శక్తి వివాహం జరగ్గా... కొంతకాలానికి వేరే కాపురం పెడతారు. భార్యా భర్త ఇద్దరూ సమానం అనుకునే మనస్తత్వం శివది.
అయితే, శక్తిపై మాత్రం సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. ఈ తరం అమ్మాయిని అనేలా తనను నిరూపించుకోవాలని చూస్తుంది. ఇంట్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేసినా అర్థం చేసుకుంటుందిలే అని సర్దుకుపోతుంటాడు శివ. తనను అర్థం చేసుకునే భర్త దొరికినందుకు సంబర పడుతుంది శక్తి. అయితే, కొద్ది రోజులకు భార్యభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో ఇద్దరూ డివోర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు? ఆ తర్వాత ఏం జరిగింది? కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఇరువురి పేరెంట్స్ ఏం చేశారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















