YS Sharmila: జగన్ కుంభకర్ణుడు, ఇప్పుడే నిద్రలేచాడు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
AP Latest News: కడప జిల్లా కమలాపురం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది.
YS Sharmila on Jagan Mohan Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుంభకర్ణుడు అని.. ఇన్నాళ్లు నిద్ర పోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యిందని.. హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని విమర్శించారు. అధికారం అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారని.. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవని అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ షర్మిల పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో పర్యటించగా.. ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
‘‘పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించా. భూమి కోసం అవినాష్ రెడ్డి అనుచరులు అతణ్ని హత్య చేశారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారు. వాళ్ళ తమ్ముడిని ట్రాక్టర్ తో తొక్కించాలని చూశారు. నిందితులను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. తమ్ముడిని చంపాలని చూసిన వాళ్ళ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు.
నిందితులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజలు ఒట్లేస్తే గెలవలేదా? ఓట్లు వేస్తే కనీసం కృతజ్ఞత లేదు. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో మొత్తం అక్రమాలు, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియానే ఉంది. రాష్ట్రమంతా ఎక్కడా అభివృద్ధి లేదు. వైఎస్సార్ హయాంలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు దిక్కులేదు.
‘‘కడప స్టీల్ వైఎస్సార్ కల. కడప స్టీల్ పూర్తి అయ్యి ఉంటే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు చేశారు తప్పిస్తే ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. జగన్ మోహన్ రెడ్డి కుంభకర్ణుడు. ఆయన అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటిదాకా నిద్ర పోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యింది. హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు.
CBI అవినాష్ రెడ్డిని నిందితుడు అని చెప్పింది. అటువంటి వ్యక్తికే మళ్ళీ జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లే. హత్య చేసిన వాళ్ళను గెలిపించాలని చూస్తున్నాడు. వివేకా స్వయానా జగన్ కి బాబాయి. బాబాయి హత్య జరిగితే కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదు. నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారు. నిందితులు చట్ట సభల్లోకి వెళ్ళొద్దని నేను నిలబడ్డా. న్యాయం ఒకవైపు, అధర్మం ఒక వైపు ఉన్నాయి. వైఎస్ బిడ్డ ఒక వైపు.. వివేకాను హత్య చేసిన నిందితుడు ఒక వైపు ఉన్నారు.
ఒకవైపు ధర్మం, మరో వైపు డబ్బు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేయండి. వైఎస్సార్ లెక్క ప్రజలకు అందుబాటులో ఉంటా. నమ్మకంగా సేవ చేస్తా’’ అని వైఎస్ షర్మిల ప్రసంగించారు.
సలహాదారు ఎలా ఉండాలో తెలుసుకోండి - సునీత
వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘వైఎస్ వివేకాను పక్కన పెట్టాలి అని చూశారు. అయినా ప్రజా సేవలో ఉన్నాడు. ఈ మనిషి నే ఉంచొద్దు అనుకున్నారు. పక్కా స్కెచ్ వేసి హత్య చేశారు. వివేకా కోరిక వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలని. షర్మిలను చూస్తే వైఎస్సార్ గుర్తుకు వస్తాడు. వైఎస్సార్ గుణ గణాలు అన్ని షర్మిలలో ఉంటాయి. షర్మిల ఉంటే వైఎస్సార్ ఉన్నట్లు ఉంటుదని వివేకా అనుకున్నారు. వివేకా హత్య పర్సనల్ విషయం అని మాట్లాడుతున్నారు. ఇది పెద్ద విషయం కాదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. సజ్జల అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. సలహా దారు అంటే ఎలా ఉండాలో ముందు అర్థం చేసుకోండి
జగన్ మాటలు సజ్జల చెప్తున్నారు. మా నాన్న ను చంపితే నాకు పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. అవినాష్ రెడ్డి కి ఎవరో ఫోన్ చేసి చెప్పారట. అంతా జరుగుతుంటే చూస్తూ ఉన్నాడట. అవినాష్ ఏమైనా పాలు తాగే పిల్లోడా? అక్కడ అంతా జరుగుతుంటే బాధ్యత లేదా?’’ అని సునీత రెడ్డి నిలదీశారు.