YS Sharmila: వివేకా హత్యకు రూ.40 కోట్ల డీల్! సీబీఐ ఆధారాలతో అవినాష్ పనేనని తెలిసింది - వైఎస్ షర్మిల
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ లో కడప ఎంపీ సీటు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. బాబాయ్ వివేకా హత్యకు అవినాష్ రెడ్డి కారకుడు అని సీబీఐ ఆధారాలు చూపించాక తాము నమ్మినట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
YS Viveka Murder Case accused is Avinash Reddy | బద్వేల్: బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు రూ. 40 కోట్ల డీల్ జరిగిందని వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. వివేకాను హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని, ఆ సమయంలో తమకు ఈ విషయం తెలియదని, ఆధారాలు చూపించిన తర్వాత నమ్మాల్సి వచ్చిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చెప్పారు. బద్వేల్ నియోజకవర్గం, పోరు మామిళ్లలో జరిగిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడూ.. వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని అన్ని ఆధారాలు చెబుతున్నాయని, మొబైల్ రికార్డ్స్,గూగుల్ లోకేషన్ లు అన్ని అవినాష్ వైపు చూపించాయని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ సృష్టించారు. సీబీఐకి సహకరించకుండా చేసి అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా చూశారని మండిపడ్డారు. ఇది అన్యాయం, అధర్మం అని, తాను వైఎస్సార్ బిడ్డను కనుక నిజం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. గతంలో కడప ఎంపీగా వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్), వైఎస్ వివేకా సైతం ఎంపీగా గెలిచి సేవలు అందించారు. ఇప్పుడు వారి దారిలో నడవాలని వైఎస్సార్ బిడ్డనైన తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు షర్మిల.
నిందితుడికి ఎంపీ సీటు ఇవ్వడం అన్యాయం
గతంలో ఏం జరిగిందో తెలియక అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు బాబాయ్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని తెలిసినా ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం అన్నారు. న్యాయం కోసమే ఎంపీగా పోటీ చేస్తున్నానని, మీరు న్యాయం వైపు ఉంటారా ? అన్యాయం వైపు ఉంటారా ? అని ప్రజల్ని ఆలోచించుకోవాలన్నారు. తాను పుట్టిన గడ్డకు సేవ చేసేందుకు వచ్చాను. ఇక్కడే ఉంట.. ప్రజలకు సేవ చేస్తాను. కడప ఎంపీగా తనను గెలిపిస్తే.. కేంద్రం మంత్రిని కూడా అయి- ప్రత్యేక హోదా సాధించుకొని వస్తానని షర్మిల హామీ ఇచ్చారు.
జగన్ YSR వారసుడు ఎలా అవుతాడు ?
ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడు? ఆయన ఆశయాలను ఒక్కటైనా అమలు చేశాడా ? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడు, వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగ, నేడు ఏపీలో అప్పు లేని రైతు ఎక్కడ లేడు అని విమర్శించారు. పంట నష్టపరిహారం అని జగన్ మోసం చేశాడు. ధరల స్థిరీకరణ నిధి అని మోసం, 2.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు.
సీఎం జగన్‌కు షర్మిల లేఖ
మరోవైపు నవ సందేహాలకు సమాధానం కోరుతూ జగన్ కు షర్మిల రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా్న్ నిధుల్ని దారి మళ్లించడం, 28 పథకాలు రద్దు చేయడం, సాగు భూమినిచ్చే కార్యక్రమం నిలిపివేయడం, ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమంలో ఎందుకు నిలిచిపోయింది, విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తొలగించారు, దళిత గిరిజన సిట్టింగ్ లకు ఈసారి సీట్లు ఎందుకు ఇవ్వలేదు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరగడం వైసీపీ వివక్ష అని, దళిత డ్రైవర్ ను హత్య చేసి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఎందుకు సమర్థించారు, స్టడీ సర్కిల్స్ కు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఇలా నవ సందేహాలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్ కు షర్మిల లేఖ రాయడం తెలిసిందే.