YSR NEWS: సంక్షేమ సారథివైఎస్‌ఆర్ 75వ జయంతి నేడు- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నివాళి
YSR JAYANTHI: పాలనా, సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఏపీపై చెరగనిముద్ర వేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి నేడు. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేసింది.
Andhra Pradesh: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి( YS Rajashekara Reddy)..ఈ పేరు తెలియనివారు తెలుగురాష్ట్రాల్లోనే ఉండరంటే అతిశయోక్తి కాదు..తన పాలన, సంక్షేమ కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌పై చెరగని ముద్రవేశారు వైఎస్‌ఆర్(YSR). వ్యవసాయానికి ఉచిత విద్యుత్(Free Power) మొదలుకుని, ఆరోగ్యశ్రీ(Arogya Sri), ఫీజు రీఎంబర్స్‌మెంట్, జలయజ్ఞం అంటే పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. నేడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి వేడుకలను ఇరురాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించనున్నారు.
సంక్షేమానికి చిరునామా
జీవచ్ఛవంలా ఉన్న కాంగ్రెస్( Congress)పార్టీలో జవసత్వాలు నింపి రెండుసార్లు కేంద్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ప్రజాప్రస్థానం(Praja Prasthanam) పేరిట రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి...ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. పూర్తి నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చారు. వినూత్నమైన సంక్షేమ పథకాలకు హామీ ఇస్తూ ప్రజల మన్నలను పొందారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ సంచలన హామీ ఇవ్వడమే గాక....అధికారం చేపట్టిన తర్వాత ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే తొలిసంతకం చేసి అమలు చేసి చూపారు. గత బకాయిలను సైతం ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) పథకంలో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. లక్షలాదిమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజినీర్లుగా జీవితంలో స్థిరపడ్డారంటే వైఎస్‌ఆర్ చలువే అనడంలో అతిశయోక్తి లేదు.
ఆరోగ్య శ్రీ(Arogya Sri) పథకంతో నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందించి మహానేతగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు రాజశేఖరుడు. లక్షకోట్లతో జలయజ్ఞం పనులు చేపట్టి...సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తిచేసిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుంది. పారిశ్రామికంగానూ రాష్ట్రాన్ని ముందంజలో నింపారు. పోర్టుల నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో పరిశ్రమలకు పెద్దపీట వేశారు. కాంగ్రెస్(Congress)పార్టీని రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చింది ఆయన అందించిన సంక్షేమఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలే.
వైఎస్‌ఆర్ జయంతి నేడు
కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8న జన్మించిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి...వైద్య విద్యను అభ్యసించారు. పులివెందుల(Pulivendula)లో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్షనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి 2004లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఓటములతో ఢీలాపడిన కాంగ్రెస్‌ను ప్రజాప్రస్థానం(Praja Prasthanam) పాదయాత్రతో అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటిక వరకు దూకుడుకు మారుపేరుగా ఉన్న వైఎస్‌ఆర్..అధికారం చేపట్టిన తర్వాత ప్రజారంజక పాలనతో ఆకట్టుకున్నారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతోనే అనతికాలంలోనే అందరి మనస్సులో చెరగని ముద్ర వేశారు. కూటమి పేరిట రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమైనా...రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే రాజశేఖర్‌రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలే. రెండుసార్లు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చిందంటే అందుకు కారణం కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ చలువేనని ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. అయితే దురదృష్టవశాత్తు 2009లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కన్నుమూశారు.
ఘనంగా వేడుకలు
వైఎస్‌ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ(YSRCP) ఘనంగా ఏర్పాట్లు చేసింది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సమాధి వద్ద జగన్ నేడు నివాళులు అర్పించనున్నారు.