Tirumala News: తిరుమలలో భక్తులపై ఫ్రాంక్ వీడియోలు - క్షమాపణలు చెప్పిన యూట్యూబర్
Andhrapradesh News: తిరుమలలో భక్తులపై ఫ్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడు యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ క్షమాపణ చెప్పారు. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేసినట్లు పేర్కొన్నారు.
Youtuber Apology On Prank Videos In Tirumala: ఇటీవల తిరుమల (Tirumala) క్యూలైన్లలో భక్తులపై ఫ్రాంక్ వీడియోలు వారి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన తమిళ యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ (TTF Vasan) తాజాగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు శనివారం ఓ వీడియో విడుదల చేశారు. 'మేము కూడా శ్రీవారి భక్తులమే. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే క్యూలైన్‌లో ఆ వీడియో తీశాం. వీడియో తీస్తుండగా తోటి మిత్రుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. దీనికి మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటి వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల తిరుమలలో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు క్యూలైన్లలో ఫ్రాంక్ వీడియోలు తీశారు. వాసన్ మిత్రుడు ఒకరు నారాయణగిరి షెడ్లలో క్యూలైన్‌లో వెళ్తూ.. కంపార్ట్‌మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా ప్రవర్తించాడు. నిజంగానే తాళాలు తీస్తున్నారని భక్తులు ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతుండగా అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ వీడియో తమిళనాడులో వైరల్ కాగా నెటిజన్లు, భక్తులు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ అధికారులు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను పట్టుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేసింది.
భక్తుల రద్దీ
అటు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి పార్కులోని షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం వెనుక భాగంలోని రింగురోడ్డు మీదుగా శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ, ఆక్టోపస్ భవనం వరకూ వ్యాపించింది. రూ.300 టికెట్లు ఉన్న ప్రత్యేక దర్శనం భక్తులకు 5 గంటల టైం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, శనివారం స్వామివారిని 75,916 భక్తులు దర్శించుకున్నారు. అందులో 42,920 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవారి దర్శనం, వసతి సేవల్లో దళారులకు చెక్ పెట్టేలా.. పారదర్శకత తెచ్చేలా టీటీడీ అడుగులు వేస్తోంది. ఆఫ్ లైన్ (కౌంటర్ సేవలు), ఆన్ లైన్ సేవల్లో అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీగా డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో బల్క్ బుకింగ్ కింద పొందిన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫేస్ రికగ్నిషన్ విధానంలో భక్తులు టికెట్లు పొందేలా చర్యలు చేపట్టనున్నారు. ఆధార్ అనుసంధానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
ఆ రోజు బ్రేక్ దర్శనం రద్దు
అటు, శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15న సిఫారసు లేఖలు స్వీకరించమని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.