Jagan House : తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద గందరగోళం- కార్యకర్తల్ని గెంటేసిన సెక్యూరిటీ
YSRCP : తాడేపల్లి జగన్ ను కలిసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది వారిని గెంటేశారు.
Tadepalli Jagan House : తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద గందరగోళం నెలకొంది. ఆయన కార్యకర్తలను కలుస్తున్నారని తెలియడంతో వివిధ జిల్లాల నుంచి రెండు, మూడు వందల మంది కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు వచ్చారు. అంతకు ముందు రెండు రోజుల పాటు కార్యకర్తలను కలిశారు. దీంతో శుక్రవారం కూడా కలుస్తారని వివిధ ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు చెప్పుకునేందుకు కార్యకర్తలు వచ్చారు. అయితే జగన్ బెంగళూరు వెళ్తున్నారని శుక్రవారం కార్యకర్తల్ని కలిసే ప్రోగ్రాం లేదని చెప్పి అందర్ని పంపేశారు. ముందుగా ఓ గంట సేపు కార్యకర్తలను కలుస్తారని చెప్పి కార్యకర్తల్ని ఇంటి లోపలికి అనుమతించారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను జగన్ వ్యక్తిగత బద్రతా సిబ్బంది డిపాజిట్ చేసుకున్నారు.
అయితే విశాఖకు చెందిన పార్టీ నేతలతో జగన్ సమావేశం పూర్తయిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్లేందుకు సిద్దం కావడంతో కార్యకర్తల్ని కలిసేందుకు సమయం లభించలేదు. దీంతో ఇవాళ కార్యకర్తల్ని జగన్ కలవడం లేదని.. వచ్చిన వారందర్నీ వెనక్కి పంపేయాలని ఆదేశాలిచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది అదే మాట చెప్పి.. కార్యకర్తల్ని ఇంటి బయటకు ప్రయత్నం చేశారు. అయితే జగన్ ను కలిసి బాధలు చెప్పుకునేందుకు చాలా దూరం నుంచి వచ్చామని అవకాశం ఇవ్వాలని వారిలో కొంత మంది పట్టుబట్టారు. సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా వారిని బయటకు పంపేశారు. వారి ఫోన్లను.. రోడ్డు మీద వేశారు. దీంతో కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు.
కొంత మంది కార్యకర్తలు జగన్ ఇంటి ముందే తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు కానీ నిర్వహించలేదు. ఆయనను కలిసేందుకు ఎమ్మెల్యేలకూ అవకాశం దొరకలేదన్న విమర్శలు వచ్చేవి. ఓడిపోయిన తర్వాత ప్రజాదర్బార్ నిర్వహించి కార్యకర్తలకు ధైర్యం చెప్పాలనుకున్నారు. అయితే ఆయన బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా పాస్ పోర్టు రెన్యూవల్ కోసం మరోసారి విజయవాడ రావడంతో రెండు రోజుల పాటు కార్యకర్తలను కలిశారు. మళ్లీ వెంటనే ఆయన బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
11 సీట్లే వచ్చినా మారని జగన్ రెడ్డి తీరు!
— YASODA KRISHNA (@YASODAK55423656) August 2, 2024
తనని కలవడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలని తాడేపల్లి ప్యాలెస్ ముందు మెడ పట్టి బయటకు గెంటించిన జగన్....
వివిధ జిల్లాల నుంచి జగన్ ను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు చేదు అనుభవం
సెల్ ఫోన్లు విసిరేసి మెడ పట్టి కార్యకర్తలను గెంటివేత#HOPE0140 pic.twitter.com/L7cqPybcpy
శుక్రవారం కార్యకర్తలను కలిసేందుకు షెడ్యూల్ లేకపోయినా కొంత మంది తరలి రావడం వల్లనే సమస్య వచ్చిందని వైసీపీ వర్గాలు చెబుతన్నాయి . ముందుగానే ఈ రోజు జగన్ ఎవర్నీ కలవరని సందేశం ఇచ్చినట్లయితే గందరగోళం ఏర్పడి ఉండేది కాదని చెబుతున్నారు. గతంలో తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ ఉండేది. ఓడిపోయిన తర్వాత ఆఫీసును మూసేసి.. గతంలో క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకున్న తన ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చారు.