Yanamala Rama Krishnudu: రాష్ట్రం కుదేలవుతుంటే, జగన్‌కి పైశాచిక ఆనందం - మాజీ మంత్రి యనమల
Yanamala Rama Krishnudu: ఆధారాలు లేని స్కాముల పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మండిపడ్డారు.
Yanamala Rama Krishnudu: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తుంటే.. ఆధారాలు లేని స్కాముల పేరుతో చంద్రబాబును అరెస్టు చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అన్నిరంగాలు నేలమట్టం అయ్యాయని. వ్యవసాయ సంక్షోభంలో పడిందని, రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, బీసి,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, తీవ్ర ఆర్ధిక సంక్షోభం వంటి అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం ఈ సమస్యలన్నింటిని వదిలేసి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి అసెంబ్లీలో సంబరాలు చేసుకుంటోందని విమర్శించారు. ఏనాడూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిన ధాఖలాలు లేవు. సభలో సమస్యలు వదిలేసి స్కోత్కర్శకాలు వినిపిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా అరెస్ట్ చేసి కోర్టుల ముందు అబద్దాలు పెట్టి నిర్భందాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ పోకడ ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాష్ట్ర భవిష్యత్ కు ప్రమాదంగా మారుతుందన్నారు.
స్కాం అని చెబుతున్న దానిలో నీలం సహాని, అజయ్ కల్లాం, ఐవైఆర్ కృష్ణారావు సంతకాలు పెట్టారని వారిని ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రిని మాత్రం రహస్యంగా కార్పోరేషన్ పెట్టి ఏదేదో చేసేశారని జైలులో పెడతారని విమర్శించారు. సీఐడీ సైతం అన్ని కోర్టులను ఇదే వాదనతో నమ్మించాలని చూస్తున్నారని విమర్శించారు. ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లా, పీవీ రమేష్, సునీత ఎవరూ బాధ్యులు కానప్పుడు చంద్రబాబు మాత్రమే బాధ్యుడు అవుతాడని అనడం దుర్మార్గపు వాదన కాదా? అంటూ ప్రశ్నించారు.
నిధులు విడుదల చేసే ముందు సీమెన్స్ - డిజైన్ టెక్ వారితో వ్యక్తిగతంగా చర్చించి పీవీ రమేష్ 6 సూచనలు చేసి 2 విడతలుగా విడుదల చేస్తానని ఒప్పుకున్నారని, ఆ విషయాన్ని స్వయంగా ఫైలులో కూడా రాశారని అన్నారు. సీమెన్స్ అనే పేరు బాగుందని చంద్రబాబు నాయుడు గారే బోర్డు పెట్టారని పేర్ని నాని చెబుతున్నారని, సీమెన్స్ గ్లోబల్ వారు మాకు సంబంధం లేని ఉత్తరం రాశారని సీఐడీ చీఫ్ సంజయ్ చెబుతారని, ఆర్థిక మంత్రి బుగ్గన సైతం సీమెన్స్ 90:10 అనేది మాకు తెలియదు అంటారని, అలాంటిది ఎక్కడా ఉండదని హేళనగా మాట్లాడతారనని అన్నారు.
సీమెన్స్ ప్రస్తుత ఎండీ మాథ్యూస్, ఇండియాలో సీమెన్స్‌కు అధిపతిగా ఉన్న వ్యక్తి ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారని, అందులో సీమెన్స్ సంస్థ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం నిజమని, తమ సాప్ట్‌వేర్ / హార్డ్ వేర్ / సేవల ధరలలో భారీ డిస్కౌంట్లు ఇస్తామని చెప్పామని, ఈ ప్రాజెక్టులను అన్ని దేశాలలో చేశామని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.3000 కోట్లు ఇస్తామని ఎప్పుడు? ఎక్కడా చెప్పలేదని, ఆ విలువ మేరకు డిస్కౌంట్లు ఇస్తూ సీమెన్స్/ డిజైన్ టెక్ సంస్థలు సాప్ట్‌వేర్/ హార్డ్‌వేర్ సేవలు అందిస్తాయని, ఈ పద్ధతిని దేశంలోనే అనేక రాష్ట్రాలలో యూనివర్సిటీలలో చూడవచ్చని మేజిస్ట్రేట్ ముందు చెప్పారని యనమల అన్నారు. దీనిపై సీఐడీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చందమామ కథలు అల్లుతూ సీఐడీ చేత చిలక పలుకులు పలికిస్తోందని యనమల విమర్శించారు. చంద్రబాబుకు పీఎస్‌గా చేసిన పెండ్యాల శ్రీనివాస్ ఆగస్టు నెలాఖరు వరకు సెక్రటేరియట్‌లో ప్లానింగ్ విభాగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వరించారని, రెండేళ్లుగా సీఐడీ ఏ రోజు ఆయనను పిలవలేదని, వైద్య పరీక్షల కోసం వెళితే ఆయన విదేశాలకు వెళ్తే, పారిపోయాడని మీడియాలోనూ, కోర్టుల ముందు విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్‌కు సీఐడీ సంస్థ నోటీసులు ఇచ్చారని, ఆగస్టు 23న సెలవు దరఖాస్తు పెట్టి అమెరికా వెళుతున్నానని తెలియజేశారని అన్నారు. కానీ ఆయనపై అధికారులు, ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు.