YSRCP MLA Slap: సమస్యల పరిష్కారం కోసం చుట్టుముట్టిన జనం - అసహనంతో చేయి చేసుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే !
ఎలమంచిలి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం కలకలం రేపింది.- తన పీఏపైనే దాడి చేశారు. చెంప చెళ్లుమనిపించారు.
YSRCP MLA Slap : ఎలమంచిలి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు సహనం కోల్పోయారు. తన పీఏపైనే దాడి చేశారు. చెంప చెళ్లుమనిపించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. అయితే సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్‌నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార యువతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాక్ నినాదాలు చేశారు.
వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పీఏ నవీన్‌వర్మ ఆయన చేయి పట్టుకుని వెనక్కిలాగారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే.. పీఏ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఎమ్మెల్యే ఇలా దురుసుగా వ్యవహరించడం ఇదే మొదటి సారి కాదన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట తనకు విద్యా దీవెన పథకం మంజూరు కాలేదని తెలిపిన విద్యార్థిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. చివరికి ఆ విద్యార్థికి క్షమాపణ చెప్పి నిధులు ఇచ్చారు.
అలాగే మునగపాక మండలం నాగులాపల్లిలో 'గడప గడపకు' కార్యక్రమంలో తాను ఐటీఐ పూర్తిచేశానని విద్యాదీవెన మంజూరు కాలేదని శంకర్ కుమారుడు శివాజీ ఎమ్మెల్యేకు తెలిపాడు. పాఠశాల యాజమాన్యానికి మంజూరైందని ఎమ్మెల్యే వివరించారు. వాళ్లకు మంజూరైనప్పుడు తనకు చెప్పడమెందుకని యువకుడు ఎదురు ప్రశ్నవేశాడు. దీంతో ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రంగా స్పందిస్తూ పథకం మంజూరై కూడా ఎదురు ప్రశ్నవేస్తావా? ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకోసం మళ్లీ మా వద్దకు రారా అని శివాజీ ఎదురు సమాధానం చెప్పేసరికి మరింత ఆగ్రహించిన ఎమ్మెల్యే 'ఎవరితో మాట్లాడుతున్నావ్. పళ్లు పీకేస్తా'అంటూ విద్యార్థిపైకి దూసుకువెళ్లారు.
ఎలమంచిలి నియోజకవర్గంలో పలు చోట్ల సమస్యల ను పరిష్కరించాలని ప్రజలు నిలదీస్తూండటంతో ఎణ్మెల్యే అసహనానికి గురవుతున్నారు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశిస్తూండటంతో ఖచ్చితంగా వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పినా చాలా మంది అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్నారు. పథకాలు రాని వాళ్లు పథకాల గురించి ప్రశ్నిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.