Bunny Vasu : వరద సహాయ చర్యల్లో సినీ నిర్మాత బన్నీ వాసుకు తృటిలో తప్పిన ప్రమాదం
Bunny Vasu : సినీ నిర్మాత బన్ని వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది. బన్నీ వాసు వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న పడవ వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతూ చెట్టును ఢీకొట్టింది.
Bunny Vasu : వరద బాధితుల సహాయ చర్యలలో సినీ నిర్మాత , జనసేన నాయకుడు బన్నీ వాసుకి తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. బన్నీ వాసు తన వంతు కర్తవ్యంగా వరదలో చిక్కుకున్న గర్భిణీని రక్షించే సమయంలో పడవ ప్రమాదానికి గురి అయింది. బాడవ గ్రామంలో వరదలో చిక్కుకున్న వారిని పడవలో ఏనుగువారి లంక తీసుకు వస్తుండగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో పడవ నీటిలో కొట్టుకుపోతూ కొబ్బరి చెట్టుకు తగిలి ఆగింది. దీంతో పడవలోని వారంతా కంగారు పడటంతో పడవ పక్కకు ఒరిగిపోయింది. వెంటనే పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు. ప్రమాదం తప్పటంతో గర్భిణీ, బన్నీవాసు, పడవలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం బాగుండి ప్రమాదం తప్పిందని బన్నీ వాసు అన్నారు. ప్రమాదం అంచున లంక గ్రామాల ప్రజలు ఉన్నారని ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
84,734 మంది 191 పునరావాస కేంద్రాలకు
ఆదివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 24.74 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. వరద ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం ఉందని వివరించారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయన్నారు. మరో 241 గ్రామాల్లో వరద చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 97,205 మందిని ఖాళీ చేయించినట్లు, 84,734 మందిని 191 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించినట్లు చెప్పారు. 1,25,015 ఆహార ప్యాకేట్లు పంచినట్లు వివరించారు. గోదావరితో పాటు, వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో వరదలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.