Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు
Rains in Telangana AP: అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
Rains in Telangana AP: నేడు బంగాళాఖతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో చివరిసారిగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
అల్పపీడనం ప్రభావంతో వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని గంటల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. శనివారం హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో, ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 8, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం మొదలైంది. ప్రస్తుతానికి కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. మరో రెండు గంటల్లో విశాఖ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభాంతో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయి.
Press release on increase in rainfall activity over Andhra Pradesh on 6th,7th and 8th October due to cyclonic circulation over South Coastal Andhra Pradesh and neighbourhood issued at 1600 Hrs IST dated:- 06.10.2022. pic.twitter.com/tlfykhGo46
— MC Amaravati (@AmaravatiMc) October 6, 2022
తెల్లవారిజామున ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు జోరందుకుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నెల్లూరు జిల్లాలోని కొస్తా భాగాలు, కృష్ణా, కొనసీమ జిల్లల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ భాగాలు, గుంటూరు, పల్నాడు, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడతాయి. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తిరుపతి నగరంతో పాటుగా తిరుపతి జిల్లాలోని పుత్తూరు, రేణిగుంట పరిసరాల్లో వర్ష సూచన ఉంది. అన్నమయ్య, కడప జిల్లాల్లో ఒకట్రెండు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.