Weather Updates: ఏపీకి తప్పిన సిత్రాంగ్ తుపాను ముప్పు - 2 రోజులు అక్కడ మోస్తరు వర్షాలు, తీరం దాటేది ఎక్కడంటే
ఏపీకి సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ చివరి నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంది.
Rains in Telangana AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ముప్పు ఏపీకి తప్పిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ఆపై బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అక్టోబర్ చివరి నాటికి ఏపీలో పూర్తి స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంది.
సిత్రాంగ్ తుపాను అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ఒడిశా, విదర్భా మీదుగా ఉపసంహరించుకుంటున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రానికి ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ కాలేదు. సిత్రాంగ్ తుఫానుతో ఏపీ, తెలంగాణలకు ఎలాంటి సమస్య లేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణపై సిత్రాంగ్ తుపాను ప్రభావం లేదు. కనుక భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదు. తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈశాన్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 22, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు విస్తరణ పూర్తయితే నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో పరిస్ధితి చూస్తే జంట ఉపరితల ఆవర్తనాల ప్రాంతాలు, తెలంగాణ మీదుగా అధికపీడన ప్రాంతం ఏర్పడింది. సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. వర్ష సూచనతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన ఉంది. తీరంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Southwest Monsoon has further withdrawn from some more parts of Vidarbha; remaining parts of Chhattisgarh, Odisha & North Bay of Bengal; some parts of Telangana, Coastal Andhra Pradesh & Central Bay of Bengal today, the 21st October, 2022. pic.twitter.com/1y1b8RdJhx
— India Meteorological Department (@Indiametdept) October 21, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో వాయుగుండం సిత్రాంగ్ తుపానుగా మారింది. తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై చాలా తక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. రాయలసీమపై తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.