Weather Update: అల్ప పీడనం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
IMD Predicts Rain in Telangana: అల్పపీడనం ఏపీ, తెలంగాణ, యానాంలతో పాటు ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అల్ప పీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మే 6 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Update: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ఏపీ, తెలంగాణ, యానాంలతో పాటు ఇతర రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అల్ప పీడనం ప్రభావంతో ఏపీలో మే 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో మే 7వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో మే 4 తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తరువాత 24 గంటల్లోనే బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మే 2 నుంచి మే 4 వరకు అసోం, మేఘాలయాలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో వర్షాలు..
ఎండలతో అల్లాడిపోతున్న ఉత్తర కోస్తాంధ్ర ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం కలుగుతోంది. అయితే పలు జిల్లాల్లో కేవలం ఒకట్రెండు చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి మరో మూడు రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు అత్యధికంగా నందిగామలో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 41.8 డిగ్రీలు అమరావతిలో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
District forecast for the next 7 days of Andhra Pradesh dated 02.05.2022 pic.twitter.com/Dj1nTBu8XK
— MC Amaravati (@AmaravatiMc) May 2, 2022
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం నేడు పొడిగా మారుతుంది. ఉత్తర కోస్తాంధ్రతో పోల్చితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. కర్నూలులో 43.4 డిగ్రీలు, తిరుపతిలో 43.2 డిగ్రీలు, నంద్యాలలో 42.6, కడపలో 42.2 డిగ్రీలు, అనంతపురంలో 41.5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి కేంద్రం తెలిపింది.
తెలంగాణలోనూ వర్షాలు..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 41 వరకు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉండనుందని శాఖ తెలిపింది.