(Source: Poll of Polls)
Weather Update: ఆ ఏడు జిల్లాల ప్రజలు రేపు పనులేం పెట్టుకోవద్దు- వాతావరణ శాఖ హెచ్చరికేంటంటే?
ఆ ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే?
నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. బుధవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ఉరుములు మెరుపులు కూడా రావచ్చని అధికారులు అంచనా వేశారు.
ఏపీలోని పలు జిల్లాల్లో రేపు (శుక్రవారం) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలతోపాటు రాయలసీమలోని ఓ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంబేద్కర్ తెలిపారు. అదే సమయంలో రాయలసీమలోని శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఐఎండి సూచనల ప్రకారం శుక్రవారం (24-06-22)
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 23, 2022
అల్లూరి సీతారామరాజు , కాకినాడ , కోనసీమ, తూర్పుగోదావరి,
పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ.
తెలంగాణ వాతావరణం ఇలా
‘‘తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.