Weather Latest Update: నేడు ఈ ప్రాంతాల్లో సాధారణంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, రాత్రిపూట చలి యథావిధిగానే
తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.
పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణలో క్రమంగా చలి తగ్గి వేడి పెరుగుతోంది. నేడు తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణంగా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు, రాత్రి పూట చలి విషయంలో 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
‘‘ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వలన తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు లానినా దిశ ఉన్నా, ఇప్పుడు పరిస్ధితులు వెనక్కి మారనున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్ధితుల కంటే ఏప్రిల్ లో మరింత స్పష్టత రానుంది.
ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు ఉండటం సహజం. దానితో పాటు హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల వలన కూడ వర్షపాతం మారుతుంది. కానీ దాని ప్రభావం అత్యల్పంగానే ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.