Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే! కానీ, ఈ రెండు జిల్లాల్లోనే వర్షాలు పడే అవకాశం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీ, తెలంగాణలో ఈ వారం చివ్వరి వరకు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. కాబట్టి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా స్వల్పంగా పెరుగుతాయని చెప్పారు. తెల్లవారుజామున కొన్ని చోట్ల పొగ మంచుతో మొదలైయ్యే వాతావరణం, మధ్యాహ్నానికి కాస్తంత వెచ్చగా ఉంటుందని, రాత్రికి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయని అంచనా వేశారు. ఈ వారం చివర్లో అంటే ఈ శనివారం, ఆదివారాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
‘‘వచ్చే వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో వచ్చే వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా లేదు. దీని కోసం ఒకటి లేదా రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ వస్తుంది. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుంది.
1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదు.
2) వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ రెండు జిల్లాల్లోనే వర్షాలు
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాత్రం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. విజయవాడకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఈ రెండు రోజులు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఆగ్నేయంగా తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 17, 2022
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 17, 2022