Weather Updates: అరకుతో పోటీ పడుతున్న హార్స్‌లీ హిల్స్.. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. తెలంగాణలో కొన్ని చోట్ల చలితో గజగజ
ఉత్తర, తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather In Andhra Pradesh: రెండు వైపుల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఓ వైపు తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి వీచే గాలులతో దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల పొగ మంచు కురియడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్ర నేటి నుంచి తగ్గే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దట్టమైన పొగ మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఉదయం వేళ ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చల్లటి తేమతో కూడిన గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయలో అత్యల్పంగా 5.7 డిగ్రీలు, చింతపల్లిలో 5.8 డిగ్రీలు, జీకే వీడిలో 5.9 డిగ్రీలు, మాడుగులలో 6.1 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ కోస్తాంద్రలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని- అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గోదావరిలోని మారేడుమిల్లిలో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగ మంచు కారణంగా ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
View this post on Instagram
రాయలసీమలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. విశాఖ అరకుకి పోటిగా చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హార్స్‌లీ హిల్స్ లో6.3 డిగ్రీలు నమోదయ్యింది. బి కొత్తకోటలో 9.4 డిగ్రీలు, మదనపల్లెలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి బాగా ఎక్కువగా ఉంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ లో 11 డిగ్రీలు, అనంతపూర్ జిల్లా సెట్టూర్ లో 12 డిగ్రీలు, కడప జిల్లా రాయచోటిలో 11.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు కొన్ని చోట్ల ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. మెదక్‌లో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీలు, రామగుండంలో 12.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 13.4 డిగ్రీలు, హన్మకొండలో 14.5 డిగ్రీలు, దుండిగల్ లో 14.8 డిగ్రీలు, నల్లగొండలో 14.8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో చలి గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య నమోదు కానున్నాయని అంచనా వేశారు.
Also Read: TTD: శ్రీవారి దర్శనానికి ఇకపై ఇవి తప్పనిసరి... వ్యాక్సినేషన్ లేదా నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే కొండ పైకి అనుమతి... రేపు సర్వ దర్శనం టికెట్లు విడుదల