Vizianagaram News : వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులు 15 శాతమే, డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
Vizianagaram News : వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం వాస్తవం కాదని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
Vizianagaram News : ఉద్యోగుల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కేవలం 15 శాతమే అని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఉద్యోగులు వైసీపీకి ఓటైయరన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.... వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు చాలా తక్కువ అన్నారు. అశోక్ గజపతిరాజు గెలుస్తారని చాలా మంది అంటున్నారని, అలాంటప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు ప్రచారం చేసినప్పుడు టీడీపీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలన్నారు. అశోక్ గజపతిరాజు రోడ్డు కనిపిస్తున్నారంటే ఎన్నికలొచ్చినట్టు అని ఎద్దేవా చేశారు. తాను జనంలోకి వెళ్తే సంక్షేమ పనులు చేస్తున్నానని అర్థం అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని పట్టభద్రులను కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. శనివారం ఆయన విజయనగరంలోని కమ్మ వీధి, శివాలయం వీధి ప్రాంతాలలో పట్టభద్రులను కలిసి వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. పట్టభద్రుల ఇళ్లకు వెళ్లిన ఆయన వైసీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
స్వరం పెంచిన ఉద్యోగులు
వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు మళ్లీ స్వరం పెంచాయి. తమకు సమయానికి జీతాలు రావడం లేదని.. తమ పింఛన్ సొమ్మును దారి మళ్లించారని... ఉద్యోగులు గరంగరం అవుతున్నారు. ఇంతకు ముందు పీఆర్సీ విషయంలో ఆందోళనలు చేసినప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ముఖ్యమైన సభ్యులు. ఇప్పుడు కూడా ఉద్యోగుల విషయాన్ని పరిష్కరించడం కోసం వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కూడా వెళ్లకుండా ఉద్యోగుల సమస్యలపై చర్చించారని సమాచారం. ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి చూపిస్తుండటం.. ఏకంగా గవర్నర్ ను కలవడం.. కలిస్తే తప్పేంటి అని ప్రకటించడం వంటి వ్యవహారాలన్నీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. పైగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగల సంఘాల నేతలు కూడా ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుండటంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. పైగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని సమస్య పరిష్కారం కాకుంటే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వాళ్లు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. పెట్టుబడుల సదస్సు జరిగే ఇలాంటి తరుణంలో ఉద్యోగుల నుంచి ఏదైనా ఊహించనిది జరిగితే.. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే సీనియర్లు అయిన సజ్జల, బొత్సకు ఉద్యోగుల బాధ్యత అప్పగించినట్లుగా అర్థమవుతోంది.
ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ జేఏసీ అమరావతి సహ అధ్యక్షుడు ఫణి పేర్రాజు అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పిరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన కార్యాచరణపై తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు చేసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. పదవీ విరమణ ప్రయోజనాలు ఇంత వరకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఇక మీదట ఉద్యోగులను పదవీ విరమణ చేయరేమోనన్న ఆలోచనలో ఉన్నామని అన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ అంటేనే ఉద్యోగులు భయపడే పరిస్థితికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చేది భిక్ష కాదని, మన హక్కులను పరిరక్షించడానికి ముందుకు రావాలని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగస్తులందరూ ఒకే తాటిపై ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన ఏపీ జేఏసీ..
ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకున్నా ఇంత వరకు ఓపికతోనే భరించామని, ఇక భరించలేమని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగులు చేపట్టే ఉద్యమాల వల్ల ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలిగినా...దానికి ప్రభుత్వానిదే పూర్తి బాద్యత అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్దితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోవటం దారుణమని వీరంటున్నారు.