Vizianagaram News : చెత్త పన్ను కట్టలేదని అపార్ట్మెంట్ ముందు చెత్త, అడ్డుకున్న యజమానిపై దాడి!
Vizianagaram News : విజయనగరం జిల్లాలో చెత్త పన్ను కట్టలేదని ఓ అపార్ట్మెంట్ ముందు చెత్త పారబోసిన ఘటన వైరల్ అవుతోంది. అధికారులు దగ్గరుండి మరీ చెత్త పారబోయించడంపై విమర్శలు వస్తున్నాయి.
Vizianagaram News : చెత్త పన్ను కట్టలేదని ఓ అపార్ట్ మెంట్ ముందు చెత్త వేశారు మున్సిపల్ సిబ్బంది. దీంతో మరోసారి చెత్త పన్ను ఇష్యూ తెరపైకి వచ్చింది. విజయనగరం కార్పొరేషన్ ఒకటో డివిజన్ అయ్యప్ప కాలనీ సాయి అమృత అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న 30 మంది కుటుంబాలు చెత్త పన్ను కట్టడం లేదని ఇంటి ముందు చెత్త వేశారు. బుధవారం ఉదయం శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, మేస్త్రీ మణికంఠ, మున్సిపల్ సిబ్బందితో బయట ఉన్న చెత్తను అపార్ట్మెంట్ గేటు ముందు వేయించడం, ఇదేంటని అడిగిన అపార్ట్మెంట్ కార్యదర్శి యూఎస్ రవికుమార్ పై భౌతిక దాడికి పాల్పడడం చర్చనీయాంశం అయింది. వీడియో తీసేందుకు ప్రయత్నించిన రవికుమార్ సెల్ఫోన్ పగలకొట్టడం అత్యంత హేయమైన చర్యని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి రమణ తెలిపారు. అపార్ట్మెంట్ వాసులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి?
అపార్ట్మెంట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చెత్త పన్ను కట్టని వారిపై భౌతిక దాడులకు దిగడం, దౌర్జన్యం చేయడం, సంక్షేమ పథకాలు నుంచి కోత పెట్టడం వైసీపీ ప్రభుత్వం విధానమా? అని టీవీ రమణ ప్రశ్నించారు. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెత్త పన్ను ఎవరి దగ్గర బలవంతంగా వసూలు చేయమని, అవగాహన కల్పిస్తామని చెబుతూనే ఈ విధమైన దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ఓట్లేసిన పాపానికి దాడి చేస్తారా అని ప్రశ్నించారు. తక్షణమే చెత్త పన్ను రద్దు చేయాలని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకవర్గం తీరు మారకుంటే అపార్ట్మెంట్, కాలనీవాసులందరినీ ఒకటి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, యూఎస్ రవికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ఈ విధంగా దాడికి పాల్పడo బాధాకరమన్నారు. స్థానిక వైసీపీ నాయకుల ప్రోత్సాహంతోనే ఇది జరిగిందని ఇలాంటి బెదిరింపులకు భయపడమన్నారు. ఇంటి పన్ను భారీగా పెంచారని దానికి తోడు చెత్త పన్ను ఏంటని రవికుమార్ ప్రశ్నించారు. కాలనీలో రోడ్లు, కాలువలు, మంచినీరు, లైట్లు వంటి సౌకర్యాలు లేవని ఈ సమస్యలు పరిష్కారానికి దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
బలవంతపు వసూళ్లు!
ఏపీలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు అధికారులు. అయితే కొన్ని చోట్ల అధికారులు బలవంతంగా చెత్త పన్ను వసూలు చేసేందుకు ప్రయత్నిస్తు్న్నారు. చెత్త పన్ను కట్టకపోతే బెదిరింపులకు దిగడంతో చెత్తను ఇంటి ముందు వేస్తున్నారు. ఎక్కడో చెత్త కుండీల్లోని చెత్తను ఇంటి వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకెళ్లడం ఆపేయాలి కానీ ఎక్కడో చెత్తను ఇంటి ముందు వేయడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే చెత్త సేకరణ, నిర్వహణ, మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే చెత్త పన్ను కట్టాలని ఆ కనీస బాధ్యత ప్రజలకు ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయనగరంలో జరిగిన ఓ ఘటనపై ప్రతిపక్షాలు మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. చెత్త పన్ను బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వీడియో వైరల్
ఏపీలో చెత్త పన్ను వసూలు మొదలుపెట్టినప్పుడు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో చెత్త పన్ను కట్టని ఓ దుకాణం ముందు చెత్తను పారబోసి మున్సిపల్ సిబ్బంది వినూత్న చర్యకు దిగారు. అలాంటి ఘటనలే అక్కడక్కడా రిపీట్ అవుతున్నాయి. తాజాగా విజయనగరంలో చోటుచేసుకుంది. కర్నూలులో వ్యాపార సముదాయం ముందు మున్సిపల్ సిబ్బంది చెత్త పారబోయగా విజయనగరంలో ఏకంగా అపార్ట్మెంట్ ముందే చెత్తను పారబోశారు. అయితే ఆ భవనం యజమానులు అడ్డుకున్నా వినకుండా, మున్సిపల్ అధికారులే సిబ్బందితో చెత్త పారబోయించడం ఈ ఘటనలో ట్విస్ట్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విజయనగరంలో చెత్తపన్ను కట్టలేదని గేటు ముందు చెత్త వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం! pic.twitter.com/HrU14sdL48
— iTDP Official (@iTDP_Official) August 24, 2022
Also Read : Kuppam News: కుప్పంలో టీడీపీ-వైసీపీ నేతల రచ్చ! అన్నా క్యాంటిన్ ధ్వంసం - రోడ్డుపైనే ఎంపీ, ఎమ్మెల్సీ నిరసన